తెలంగాణపై మాట మార్పు: షిండేకు నారాయణ లేఖ

అధికారిక ప్రకటనలో నెల రోజుల లోపల నిర్ణయం తీసుకుంటామనే మాట లేకపోవడం వల్ల ప్రభుత్వానికి దురుద్దేశ్యం ఉందనే అనుమానాలు కలుగుతాయని ఆయన అన్నారు. పిఐబి విడుదల చేసిన ప్రకటనలో లోపం జరిగితే సరిదిద్ది మళ్లీ విడుదల చేయాలని ఆయన షిండేను కోరారు. అఖిల పక్ష సమావేశం ముగిసిన తర్వాత షిండే మీడియాతో మాట్లాడుతూ - నెల రోజుల లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నెల రోజుల కన్నా ముందే తెలంగాణపై తేలుస్తామని అఖిల పక్ష సమావేశంలో షిండే చెప్పారని, అయితే హోం మంత్రిత్వ శాఖ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆ ప్రస్తావనే లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన మాటలు సాయంత్రానికి మారిపోయాయి. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని షిండే అఖిల పక్ష సమావేశానంతరం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. మీడియా ప్రతినిధులు ఆ తర్వాత వేసిన ప్రశ్నకు కూడా అదే సమాధానం ఇచ్చారు. కానీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన ప్రకటనలో మాట మార్చేశారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామనే విషయం ప్రకటనలో లేదు.
నెల రోజుల్లోగా పరిష్కరించాలని కొన్ని పార్టీలు కోరాయని మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉంది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అంశం అందులో లేదు. నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని షిండే తమకు అఖిల పక్ష సమావేశంలో చెప్పినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మీడియాతో చెప్పారు. అదే విషయాన్ని ఆ తర్వాత షిండే తన మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్రువీకరించారు. దీంతో నెల రోజులు ఆగలేరా అంటూ కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు ఇతర పార్టీలను అడిగాయి కూడా. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటనపై రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షాలు మండిపడ్డాయి.












Click it and Unblock the Notifications