వారి ఉద్దేశం అది కావచ్చు: నారా లోకేష్‌పై పొన్నం

తాము తెలంగాణకు పూర్తి అనుకూలంగా నిర్ణయం చెప్పామని ప్రదర్శించుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి వద్ద బాణసంచా పేల్చుకుని సంబరాలు చేసుకుని ఉండవచ్చునని, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని, కానీ తాము ఆ ఉద్దేశంతో ఏకీభవించడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదని మాత్రమే అంటున్నారని, తాను తెలంగాణకు సానుకూలమని చెప్పడం లేదని ఆయన అన్నారు.
తాను పెద్ద మాదిగను, నాయక్‌ను అంటున్న చంద్రబాబు తెలంగాణపై కూడా అంతే స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా జై తెలంగాణ అనాలని, తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నానని స్పష్టంగా చెప్పాలని, తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని అంటే సరిపోదని ఆయన అన్నారు. తెలంగాణకు మద్దతు ఇస్తానని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకుంటే మంచిదని శుక్రవారం తాను చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన వెనక్కి తీసుకున్నారు. తెరాస ఇచ్చిన బంద్ పిలుపును తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణపై పార్టీల మీద, కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి పెట్టడానికి రాజకీయ ప్రక్రియలు సాగాల్సిందేనని పొన్నం ప్రభాకర్ అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ నాయకులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డును ప్రదర్శించినంత స్పష్టంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తాను తెలంగాణకు అనుకూలమని చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు సంస్కారం లేదనే వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు కెకె మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సంస్కారం లేదని, జోకర్లని వ్యాఖ్యానించిన కెకె మహేందర్ రెడ్డికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు ఎంపీల్లో ఎవరు చదువుకోలేదో, ఎవరికి సంస్కారం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉండి కూడా తాము తెలంగాణ కోసం పోరాటాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ బిడ్డ అయితే కెకె మహేందర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications