కాళ్ల నొప్పులున్నాయి, సెల్‌ఫోన్లు పెంచింది నేనే: బాబు

చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద యెత్తున ప్రజలు హాజరయ్యారు. బాణసంచా పేలుస్తూ సందడి చేశారు. కరెంట్ కొరత లేని రాష్ట్రాన్ని తాము అధికారంలోకి వస్తే మళ్లీ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వ హయాంలో వస్తే రైతులకు 9 గంటల విద్యుత్ ఇచ్చామని ఆయన చెప్పారు. ట్రాన్స్‌పార్మర్లు పాడైతే 24 గంటల్లోగా మార్చేసేవాళ్లమని ఆయన అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కిరికిరి ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. విద్యుచ్ఛక్తి శాఖకు మంత్రి కూడా లేరని, ముఖ్యమంత్రికేమో అవగాహన లేదని చంద్రబాబు అన్నారు. విద్యుత్ వ్యవస్థ ఎందుకు పతనమైందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముడుపులు తీసుకుని ప్రైవేట్ విద్యుత్తు ధర పెంచారని, కాంగ్రెసు ప్రభుత్వ విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ ధరులు, ఆర్టీసి చార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు.
రైతులకు ఐదు లాఠీదెబ్బలు, ఒక యూరియా బస్తానా అని ఆయన అడిగారు. తమ ప్రభుత్వ హయాంలో చివరి భూములకు కూడా నీళ్లిచ్చామని, కష్టమైనా సరే రైతులు తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని అన్నారు. సెల్‌ఫోన్ల విస్తృతికి తాను ఎంతో కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు సెల్‌ఫోన్లున్నా వీధిదీపాలు, మరుగుదొడ్లు లేవని ఆయన అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పెట్టి అందరికీ రక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
మహిళల అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల నడ్డి విరగ్గొట్టిందని వ్యాఖ్యానించారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరెంట్ కోతల వల్ల పది లక్షల మంది నిరుద్యోగులయ్యారని చెప్పారు. తాము పెట్టిన వ్యవసాయ విస్తరణాధికారులను వైయస్ రాజశేఖర రెడ్డి తొలగించారని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications