ఏ పార్టీలో చేరను: చేరికపై కొట్టిపారేసిన కోమటిరెడ్డి

రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్లడం సరికాదన్నారు. ఆయన పిసిసి చీఫ్‌గా అనర్హుడు అన్నారు. సమర దీక్షకు వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఉద్యమ పార్టీ కాబట్టే తాను కెసిఆర్‌ను కలిశానని, ఆ పార్టీలో చేరేందుకు కాదన్నారు.
కాగా రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెసిఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కోమటిరెడ్డి సోదరులు తెరాసలో చేరతారనే ప్రచారం ఎక్కువయింది. అవసరమైతే తెరాసలోకి వెళ్తామని గతంలో కోమటిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాకపోయినా కెసిఆర్‌తో చర్చించిన మీదట కొద్ది రోజుల తర్వాతనైనా తెరాలకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనే వాదనలు వినిపించాయి.
కోమటిరెడ్డి సోదరులు మొదటి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. వారి మాటలు కూడా జగన్ పార్టీలోకి వెళ్లేటట్లుగానే కనిపించేవి. కాంగ్రెసులో ఉన్న వారు జగన్‌కు మద్దతుగా మాట్లాడుతుంటారు. దీంతో నల్గొండ జిల్లా కాంగ్రెసు నేతలు కూడా వారు ఎప్పటకైనా జగన్ పార్టీలోకి వెళ్లే వారే అనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే అనూహ్యంగా వీరు జగన్‌కు ఝలక్ ఇచ్చి తెరాసలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నెల రోజులుగా ప్రచారం సాగుతోంది.
వారు ఏ క్షణంలోనైనా తెరాసలోకి వెళ్తామనే ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. కానీ కోమటిరెడ్డి ఆ వార్తలను ఖండించారు. తాను స్వతంత్రంగా తెలంగాణ కోసం ఉద్యమిస్తానని చెప్పారు. ఆయన తెలంగాణ కోసం గతంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications