హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ తీరు: ఎవరేమన్నా ఎదురుదాడే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి నుంచీ ఒకే విధానాన్ని అనుసరిస్తోంది. తమపై విమర్శలు, ఆరోపణలు చేసే పార్టీలపై ఎదురుదాడే ప్రధాన వ్యూహంగా ఎంచుకుంది. వైయస్ జగన్ అరెస్టు ఉదంతం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నాయకులు దాన్నే ప్రధానంగా అస్త్రంగా ఎంచుకున్నారు. తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా, ఆరోపణలు చేసిన వారిని నిందించడం పనిగా పెట్టుకున్నారు.

తాజాగా, వైయస్ జగన్ సోదరి షర్మిల, అనిల్ కుమార్ దంపతులపై బిజెపి నాయకుడు ప్రభాకర్‌కు వైయస్సార్ కాంగ్రెసు నేతల ఎదురుదాడి రుచి తెలిసి వచ్చింది. బిజెపి కార్యాలయంలో కూర్చుని తెలుగుదేశం పార్టీ నేతలాగా మాట్లాడుతున్నారంటూ ఆయనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు దుయ్యబట్టారు. షర్మిల అవినీతిపై మాట్లాడుతున్న ప్రభాకర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అవినీతి తెలియదా అని అడిగారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుండా ఇతర పార్టీల నాయకులు విమర్సలు చేసినప్పుడు వారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గురించి ప్రశ్నలు వేయడం ఒక వ్యూహంగానే పెట్టుకున్నారు. చంద్రబాబుతో వారు కుమ్మక్కయ్యారనే విధంగా మాట్లాడడం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అలవాటు చేసుకున్నారు.

ఓ ప్రముఖ దినపత్రిక వైయస్ జగన్ విడుదల కోసం సేకరించిన కోటి సంతకాలు తప్పుల తడక అంటూ దొంగ సంతకాలు సేకరించారంటూ ఓ కథనాన్ని ప్రచురించినప్పుడు చంద్రబాబు కోసం ఆ పత్రిక పనిచేస్తోందంటూ దుయ్యబట్టారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఆ పత్రిక కంకణం కట్టుకుందని, ఆ పత్రికకే అటువంటి అలవాట్లు ఉన్నాయని పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నేత కూడా ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు విమర్శలు చేస్తే ఆయనపైకి ఎన్టీ రామారావు హయాంలో జరిగిన పరిణామాలను ఎత్తి చూపుతున్నారు.

ఎన్టీ రామారావును గద్దె దించడానికి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల దొంగ సంతకాలు చంద్రబాబు చేయించారని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయి జగన్‌ను జైలులో పెట్టించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. వైయస్ జగన్ అవినీతి గురించి ప్రస్తావన వస్తే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వైయస్ జగన్ అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించవద్దనే ధోరణిలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.

ఇతర పార్టీలపై ఎదురు దాడి చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెద్ద సైన్యమే ఉంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బాలినేని శ్రీనివాస రెడ్డి, శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖ, రోజా, అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్, వాసిరెడ్డి పద్మ, జూపూడి ప్రభాకర రావు, మారెప్ప, ఇలా... ఈ జాబితా పెద్దదే. మధ్య మధ్యలో ఎంవి మైసురారెడ్డి వంటి సీనియర్ నేతలు బయటకు వస్తుంటారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.

మొత్తం మీద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తమ నేత వైయస్ జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తడాఖా చూపిస్తారనే పద్ధతిలోనే ఉంది. వైయస్ జగన్ బయటకు రావడం ఖాయమనే విశ్వాసం వారిని ముందుకు నడిపిస్తోంది. తమ పార్టీ సత్తాను చూపించడానికి మధ్య మధ్యలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శానససభ్యులను పార్టీలో చేర్చుకోవడం కూడా ఓ వ్యూహం ప్రకారమే జరుగుతోందని అంటున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు నేతల తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదని, ప్రస్తుత రాజకీయాలకు అవి అద్దం పడుతున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. అవినీతికి పాల్పడని రాజకీయ నేత ఉంటాడనే ఆశ్చర్యపడే కాలంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఎదురుదాడి ప్రజల్లో పనిచేసే అవకాశం కూడా లేదని అంటున్నారు.

English summary
YS Jagan's YSR Congress party leaders are habituated to made counter attack on leaders of rival parties, who will question their party attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X