జగన్‌కు షాక్: హల్‌చల్, అజ్ఞాతంలోకి రవీంద్రనాథ్ రెడ్డి

కడప జిల్లా సహకార శాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆయన కార్యాలయం పేరిట స్టాంపు తయారుచేసి వాడుకున్నారనే ఆరోపణలపై రవీంద్రనాథ రెడ్డిపై కేసు నమోదైంది. సహకార ఎన్నికల సందర్భంగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెద్దచెప్పలి సొసైటీ పరిధిలో తెలుగుదేశం, కాంగ్రెస్‌లు కుమ్మక్కై బోగస్ ఓటర్లను నమోదు చేశాయంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై రవీంద్రనాథ రెడ్డి జిల్లా సహకార శాఖ అధికారికి డిసెంబర్ నెలాఖరులో (డీసీవో) తాము ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు.
డీసీవో సంతకం, కార్యాలయ స్టాంపుతో కూడిన జిరాక్సు పత్రాలను స్థానిక సహకార అధికారులకు అందించారు. దీని ఆధారంగా స్థానిక అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే, అప్పటికే అభ్యంతరాల స్వీకరణకు గడువు ముగిసినందున, దీనిపై విచారణ జరుపుతారంటూ టీడీపీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. రవీంద్రనాథ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్న సంతకం, సీలు తమవి కావని డీసీవో చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
జనవరి 12న ఆయన ఫిర్యాదు జిరాక్స్ కాపీలు మాత్రమే తనకు అందించారని, వాటిని పరిశీలించినప్పుడు సంతకం, సీలు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దీంతో తెలుగుదేశం నాయకులు రవీంద్రనాథ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై ఐపీసీ 420, 468, 471, 473 సెక్షన్‌ల కింద కడప వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులను కొట్టివేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆపాలంటూ రవీంద్ర నాథ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కడప పోలీసులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని బుధవారం స్పష్టం చేసింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డి తనను అరెస్టు చేయవచ్చుననే అనుమానంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications