హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ్యూహం: ఆత్మరక్షణా, అసద్‌కు చిక్కులా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Asaduddin Owaisi
హైదరాబాద్: శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దించాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. మార్చి 20వ తేదీన శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మైనారిటీ వర్గానికి చెందిన మహమూద్ అలీని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు.

అయితే, ప్రస్తుతం తెరాసకు 17 మంది శాసనసభ్యులున్నారు. మహమూద్ అలీ గెలవడానికి ఈ బలం సరిపోదు. 30 మంది దాకా శాసనసభ్యులు మద్దతు అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మజ్లీస్ మద్దతును కోరారు. మజ్లీస్‌కు ఏడుగురు శాసనసభ్యులున్నారు. మజ్లీస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది. దానికితోడు, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చేరువ అవుతోంది. ఈ స్థితిలో మజ్లీస్ తెరాస అభ్యర్థికి మద్దతు ఇస్తుందా అనేది ప్రశ్న.

మైనారిటీ అభ్యర్థి కాబట్టి మజ్లీస్ మద్దతు ఇవ్వాలనేది కెసిఆర్ మజ్లీస్ అధినేత అసదుద్దీన్‌కు చేసిన విజ్ఞప్తి. మజ్లీస్ మద్దతు ఇవ్వకపోతే అనుసరించాల్సిన వ్యూహంపైనే కెసిఆర్ దృష్టి ఎక్కువగా ఉంది. మజ్లీస్ తెలంగాణకు వ్యతిరేకమే కాకుండా మైనారిటీ ప్రయోజానాలకు కూడా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ప్రచారం చేయాలనేది కెసిఆర్ వ్యూహంగా చెబుతున్నారు. తద్వారా అసదుద్దీన్‌కు చిక్కులు కల్పించాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

మరో వైపు మరో వాదన కూడా సాగుతోంది. తాము అభ్యర్థిని పెట్టకపోతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలున్నాయనే ఆలోచన సాగుతూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా చేయడానికే చాలా ముందుగా కెసిఆర్ అభ్యర్థిని ప్రకటించారని అంటున్నారు. తాము అభ్యర్థిని పెట్టకపోతే, తమ పార్టీ శానససభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటేసినా ఆశ్చర్యం లేదనే భావన ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. అలా జరిగితే తీవ్రమైన విమర్శలను కెసిఆర్ ఎదుర్కోక తప్పదు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి, ఆత్మరక్షణలో భాగంగానే అభ్యర్థిని ప్రకటించినట్లు చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాకున్నా మరే పార్టీకి తమ శాసనసభ్యులు మద్దతు ఇచ్చినా బద్నాం కాక తప్పదని కెసిఆర్ భావించి ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే అభ్యర్థిని ప్రకటించారని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థి మహమూద్ అలీ గెలుస్తారని కూడా కెసిఆర్ నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, ఇతర పార్టీల శాసనసభ్యుల మద్దతు లభిస్తే తప్ప అది సాధ్యం కాదు.

తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలైనా తెరాస అభ్యర్థిని బలపరుస్తారా అనేది అనుమానంగానే ఉంది. కెసిఆర్ ఏకపక్ష వైఖరిని సిపిఐ ఇప్పటికే తప్పు పడుతోంది. సిపిఐకి నలుగురు శాసనసభ్యులున్నారు. తెలంగాణ నాగరా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఇటీవల కెసిఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బిజెపితోనూ కెసిఆర్‌కు సఖ్యత లేదు. బిజెపికి ముగ్గురు శానససభ్యులున్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న ఆ పార్టీలకు తమకు మద్దతు ఇవ్వడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదని కెసిఆర్ భావించి ఉంటారు. ఏమైనా, ఎక్కడో గురి పెట్టి, కెసిఆర్ మరెక్కడో కొడతారా.. ఏమో...

English summary
According to political analysts - Telangana Rastra Samithi (TRS) president has announced the candidate for MLC elections to be held under MLAs quota to create trouble to MIM chief Asaduddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X