వైఎస్‌తో నాశనం: టిడిపి, జగన్ పార్టీ ఫైర్, కాంగ్రెస్ వంత

అప్పుడు అవిశ్వాసం పెడితే జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదన్నారు. ఇప్పుడు వారి స్వార్థ రాజకీయాల కోసం అవిశ్వాసం పెట్టారన్నారు. అవిశ్వాసం పెట్టేందుకు తమ పార్టీ అధినేత జైలులో లేరని ఎద్దేవా చేశారు. వాళ్ల కోసం మేము అవిశ్వాసం పెట్టాలా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకొచ్చింది కాబట్టే ఆ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు పలికామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అన్ని ప్రాంతాల సమస్యల పైన మాట్లాడారన్నారు. నాడు టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు ఆ పార్టీ అడగకున్నా తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశామన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని రెండు గంటలు తిట్టినా తాము టిడిపి అవిశ్వాసానికి మద్దతు పలికామన్నారు. ప్రజా సమస్యలపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామని ముందే చెప్పామని అందుకే తెరాసకు మద్దతు పలికామన్నారు. తమ అజెండా ఏమిటో తమకు తెలుసునని, ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాము పదవులు త్యాగం చేసి మళ్లీ గెలిచామని, తమ విశ్వసనీయత గురించి ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. చంద్రబాబు నాయుడును వైయస్ విజయమ్మ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.
ఎవరి స్క్రిప్టో, బాధేస్తుంది: విజయమ్మపై మోత్కుపల్లి
కాంగ్రెసు పార్టీని ఈ దేశంలో స్థానిక పార్టీ దశకు తీసుకు వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జాతీయ భావాలతో పుట్టిన ప్రాంతీయ పార్టీ టిడిపి అన్నారు. ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేందుకు వైయస్ విజయమ్మ పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. అమాయకురాలిని సభకు తీసుకు వచ్చి బాధపెడుతున్నారన్నారు.
బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేస్తోంది టిడిపియే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. సామాజిక గొంతు వినిపించింది టిడిపియే అన్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కయిందనడం బుద్ధిలేని రాజకీయం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు కాంగ్రెసు పార్టీలో కలవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే జగన్ పార్టీ పెట్టారన్నారు. ఆ పార్టీ తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ వ్యతిరేక విధానాల పునాదులతో టిడిపి పుట్టిందన్నారు.
ఓఎంసిలో కాపు రామచంద్రా రెడ్డి వాటా దారుడు అన్నారు. ఆయన త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు. తాను మాట్లాడుతుండగా.. నిలబడ్డ వారిని సూచిస్తూ వారిలో వంద కోట్లకు తక్కువ ఉన్న వారెవరు లేరని మోత్కుపల్లి అన్నారు. విజయమ్మ పట్ల తమకు సానుభూతి ఉందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండు పార్టీలు తోడు దొంగలే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జైలులో ఉండేవాడన్నారు. సిబిఐ విచారణలో వారు దొంగలని తేలిందన్నారు. జగన్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. రూ.43వేల కోట్లు దోచుకున్నారని సిబిఐ చెప్పిందన్నారు.
ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవసరమైన వాటి కోసం త్యాగాలు చేయాలే తప్ప సొంత రాజకీయాల కోసం కాదన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఏ ఒక్కటి సొంతగా చెప్పలేదన్నారు. దోపిడీ చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటన్నారు. సిబిఐ ఛార్జీషీటులోనే వారి గురించి ఉందన్నారు.
సభలో లేని వ్యక్తి గురించా?: కాపు
సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీతో తమ కుమ్మక్కు బయట పడుతుందనే వారు వైయస్ గురించి ప్రస్తావిస్తున్నారన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఆ పార్టీ కాంగ్రెసుకు మద్దతు పలుకుతోందన్నారు. వైయస్ గురించి మాట్లాడటాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నిరసన తెలుపుతున్నారు.
ప్రజా సమస్యలపై అవిశ్వాస తీర్మానం పెడితే మా పైనే ఎదురు దాడి చేస్తారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
జగన్ పార్టీకి చివాట్లు: పయ్యావుల
కాంగ్రెసు పార్టీపై అవిశ్వాసం గురించి మాట్లాడమంటే టిడిపి గురించి మాట్లాడటమేమిటని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుపై ఎన్నో కేసులు వేసి ఉపసంహరించుకున్నారని, జగన్ బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లి చివాట్లు పెట్టించుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై మండిపడ్డారు.
కోట్లు తిన్నారని మోత్కుపల్లి అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఉలిక్కిపాటు ఎందుకని ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. వారేమైనా దోపిడీ చేశారా అని ప్రశ్నించారు. సభలో లేని వైయస్ ప్రస్తావన వద్దంటే చంద్రబాబు, ఎన్టీఆర్‌ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిబిఐ రిపోర్ట్ చదివితే మంట ఎందుకన్నారు.
వైయస్ గురించి వద్దు: శ్రీధర్ బాబు
సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సముచితం కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సభలో లేని వైయస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని మంత్రి దానం నాగేందర్ కూడా అన్నారు. జూలకంటి రంగారెడ్డి, గాదె వెంకట రెడ్డి కూడా సభలో లేని వ్యక్తుల గురించి అనవసర వాదనలు వద్దని సూచించారు.
రికార్డుల నుండి తొలగిస్తాం
మోత్కుపల్లి అభ్యంతర వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!