సస్పెన్స్‌కి తెర: జగన్‌తోను దోబూచులాడిన జోగి రమేష్!

ఆఖరి నిమిషం వరకు అసెంబ్లీలో తమ వెంట తిరుగుతూ, తమతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి వద్దకు కూడా వచ్చి తాను పార్టీలోనే ఉంటానని చెప్పిన జోగి అసెంబ్లీలో ప్రభుత్వ వ్యతిరేక తీర్మానానికి అనుకూలంగా లేచి నిల్చోవటాన్ని మంత్రి పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో శుక్రవారం అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలోనే వీరు, జారిపోతాడేమోనని అనుమానంగా ఉన్న జోగిని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు.
చివరి వరకు వారి వెంటే ఉన్న జోగి ఓటింగ్ విషయంలో బయటపడి పోయారు. అసెంబ్లీలో విష్ణుకు ముందు వరుస సీట్లో కూర్చున్న జోగి ఆకస్మాత్తుగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు లేచి నిల్చోవడంతో జిల్లా నాయకులు బిత్తరపోయారు. చాలాకాలం క్రితం నుంచి ఆయన వ్యవహారం కాంగ్రెస్ నేతలకు అనుమానంగానే ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే విషయంలో జోగి రమేష్ దోబూచులాడుతూ ఇక్కడొక మాట, అక్కడొక మాట మాట్లాడుతున్నారట. రెండు పార్టీల్లో గందరగోళ వాతావరణం సృష్టించారట.
బొత్స కొద్దికాలం క్రితమే పలువురు ఎమ్మెల్యేలకు షోకాజ్ జారీ చేయడంపై మండిపడిన జోగి మీడియాకెక్కారు. ముఖ్యమంత్రిని గద్దె దించడానికే బొత్స ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమించారని ఆరోపించారు. పార్టీలోనే ఉంటానని చెప్పిన జోగి రమేష్ మాటలను ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న మంత్రి పార్థసారథి నమ్మారు. రమేష్ పార్టీ వదలకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడా జోగి రమేష్ సన్నిహితంగా మెలిగేవారు.
జగన్ అవినీతిపై పలుమార్లు జోగి రమేష్, మల్లాది విష్ణులు మీడియా సమావేశాలు నిర్వహించి ధ్వజమెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఉప ఎన్నికల అనంతరం వైఖరి మార్చుకున్న జోగి రమేష్ పెడన టికెట్ ఇస్తే వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్ళటానికి ఆ పార్టీ నాయకులతో రాయబారాలు సాగించారట. కానీ పెడన టికెట్ కోసం అప్పటికే జగన్ పార్టీలో ఇద్దరు ఉన్నారట. ఇద్దరిలో ఒకరికి ఇస్తానని జగన్ హామీ కూడా ఇచ్చారట.
దీంతో జోగి రమేష్ కండిషన్‌ను వారు పక్కన పెట్టారట. అప్పటి నుండి జోగి రమేష్ కాంగ్రెసు వైపు, వైయస్సార్ కాంగ్రెసు వైపు అంటూ దోబూచులాడారట. కైకలూరు టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ పార్టీ సిద్ధపడిందట. అందుకు జోగి రమేష్ ససేమీరా అని మైలవరం అడిగినట్లుగా తెలుస్తోంది. దానిపై కూడా స్పష్టత రాకపోవడంతో జోగి రమేష్ అంశం సస్పెన్స్‌గా మారిందని చెబుతున్నారు. తాజాగా జగన్ పెడన టిక్కెట్ ఇచ్చేందుకు అంగీకరించిన తర్వాతే జోగి రమేష్ ఫిరాయించారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications