కిరణ్‌కు టిడిపి, జగన్ పార్టీల పవర్ సెగ: నిరాహార దీక్ష!

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ.. విద్యుత్ కోతను నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరవధిక దీక్షకు దిగాయి. విద్యుత్ పైన సోమవారం స్వల్పకాలిక చర్చ సభలో వాడిగా వేడిగా జరిగింది. అయితే, ప్రభుత్వం తీరు పట్ల టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ విషయంలో ప్రభుత్వాన్ని దోషిగా చూపించేందుకు ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి.
నిరాహార దీక్ష లేదా యాత్ర
విద్యుత్ అంశంపై తీవ్రస్థాయిలో ఉద్యమించాలని టిడిపి భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలనే యోచనలో ఉంది. విద్యుత్ సమస్యను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెసు ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేందుకు టిడిపి కసరత్తు చేస్తోంది. విద్యుత్ సంక్షోభంపై నిరవధిక దీక్ష లేదంటే యాత్రగా ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉంది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబుతో చర్చించిన అనంతరం యాత్ర లేదా ధర్నా చేపట్టాలని టిడిపి భావిస్తోంది. దీక్ష చేయాల్సి వస్తే న్యూఎమ్మెల్యే క్వార్టర్సులో చేయాలని చూస్తోంది.
విజయమ్మ నేతృత్వంలో..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా విద్యుత్ సమస్యను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందు ఈ సమస్యతో టిడిపి రాజకీయ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని భావించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాము కూడా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. విద్యుత్ విషయంలో అదనపు భారాన్ని ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోందట. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని భావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గాల్లో పర్యటించనుంది.












Click it and Unblock the Notifications