ఫ్లెక్సీల దుమారం: జగన్ పార్టీ నేతలతో జూ. ఎన్టీఆర్
హైదరాబాద్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో కలిసి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. షర్మిల పాదయాత్ర సందర్బంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇది జూనియర్ ఎన్టీఆర్ అంగీకారంతోనే జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫ్లెక్సీల్లో తన చిత్రాన్ని ప్రచురించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు.
జూనియర్ ఎన్టీఆర్‌కు కొడాలి నాని సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్థితిలో గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని, పేర్ని నానిల ఫొటోలున్న ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కూడా ఉంది. దీంతో తన వర్గానికి చెందిన నాయకులను జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పంపిస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతోంది. పేర్ని నానీ, కొడాలి నానిల మీద అభిమానంతోనే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశానని వాటిని పెట్టిన వ్యక్తి అంటున్నాడు.
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరమయ్యారనే సంకేతాలను తీసుకుని వెళ్లడానికి ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుట్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. కొడాలి నాని, పేర్ని నాని జూనియర్ ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని అంటున్నారు.

ఇదిలావుంటే, షర్మిల పాదయాత్ర సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి రాధ, నెహ్రూ వర్గాల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీల చిచ్చు రగిలింది. రాధాకృష్ణ వర్గానికి చెందిన ఫ్లెక్సీలకు పోటీగా దేవినేని నెహ్రూ వర్గానికి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు.
తన ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ అనుమతి ఉండే ఉంటుందని, జూనియర్ ఎన్టీఆర్ కూడా తన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాల్సి ఉంటుంది కదా అని లక్ష్మీపార్వతి ఓ ప్రముఖ టీవీ చానెల్‌తో అన్నారు. తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను రానీయడం లేదని, అందుకే ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఉంటారని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్లో తన ఫొటో ఉండడాన్ని ఖండించలేదంటే అనుమతి ఉందని భావించాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications