ఎన్టీఆర్ ఇమేజ్: బాబుకు తలనొప్పి, బాలయ్య కార్నర్

చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న బాలకృష్ణను కూడా సున్నితంగానైనా సరే, వ్యతిరేకించాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లు హరికృష్ణ ప్రకటనను, కేంద్ర మంత్రి పురంధేశ్వరి మాటలను బట్టి అర్థమవుతోంది. బాలకృష్ణపై హరికృష్ణ మెత్తగానే ఆయినా గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను పూర్తిగా వెనకేసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను బాలకృష్ణ హెచ్చరించడాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
ఎన్టీ రామారావు ప్రజలందరివాడని, ఎవరైనా ఎన్టీఆర్ బొమ్మను వాడుకోవచ్చునని పురంధేశ్వరి ఇప్పటికే అన్నారు. అదే మాటను కాస్తా ఘాటుగా హరికృష్ణ అన్నారు. దీంతో ఎన్టీ రామారావు వారసత్వాన్ని చంద్రబాబుకు దూరం చేయాలనే ఉద్దేశంతో నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అర్థమవుతోంది. నందదమూరి కుటుంబంలో కలతలు ఉన్న మాట నిజమేనని తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్లల గోపాలకృష్ణా రెడ్డి అన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఎన్టీఆర్ ఒక పార్టీకి మాత్రమే చెందినవాడని చెప్పడానికి పార్టీలోని కొంత మంది నాయకులు కూడా వెనకాడుతున్నారు.
ఎన్టీఆర్ అందరివాడని, గొప్ప ప్రజానాయుకుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరావు అంటూనే రాజకీయ కోణంలో ఎన్టీఆర్ పేరును వాడుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు పేరును ఎవరైనా వాడుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ మరో నాయకుడు శివప్రసాద్ అన్నారు. శివప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరగాయి. హరికృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో బాలకృష్ణ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగానే మారింది. అయితే, చంద్రబాబు ఆ వ్యవహారంపై మాట్లాడుతారా, లేదా అనేది తేలడం లేదు. అయితే, మీడియా సమావేశం పెడితే మాత్రం తప్పకుండా మాట్లాడాల్సిన పరిస్థితి రావచ్చు. ఏమైనా, చంద్రబాబుకు వ్యవహారం పెద్ద తలనొప్పిగానే మారింది.












Click it and Unblock the Notifications