వైయస్ విజయమ్మ దీక్ష సక్సెస్సా?: ఒత్తిడిలో జగన్‌పార్టీ

ఇందిరా పార్కు వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణలు దీక్షకు దిగారు. వారి దీక్ష చేసినన్ని రోజులు పతాక శీర్షికలకెక్కింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట్సు వద్ద దీక్షకు దిగింది. వెంటనే భారతీయ జనతా పార్టీ స్పందించింది. విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునే ప్రయత్నాలు చేశాయి. ఇందులో టిడిపి ఒకింత సక్సెస్ అయినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సఫలం కాలేదంటున్నారు.
ఛార్జీల పెంపు విషయంలో అన్ని పార్టీలు స్పందించి దీక్షలకు దిగిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దిగిందని, ఆ పార్టీ పొలిటికల్ మైలేజ్‌కి ఇది ఏమాత్రం ఉపయోగపడలేదంటున్నారు. అంతేకాకుండా దీక్షా సమయంలో ఆ పార్టీ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించిందంటున్నారు. ఇతర పార్టీలు దీక్ష కోసం పార్టీ క్యాడర్‌ను రాష్ట్రవ్యాప్తంగా సమాయత్తం చేసింది. ఈ అంశాన్ని తమ మైలేజ్‌కు వినియోగించుకోవాలనే ఆతృతలో జగన్ పార్టీ మాత్రం అప్రమత్తం చేయకుండానే ప్రారంభించింది.
దీంతో తొలి రోజు దీక్ష చప్పగా సాగిందనే వ్యాఖ్యలు వినిపించాయి. వ్యాఖ్యల ఎఫెక్ట్ కారణంగా రెండో రోజు నుండి దీక్షా ప్రాంగణం హోరెత్తింది. అయితే, ఆ పార్టీ మూడో రోజు నుండే తమ దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించడం ప్రారంభించింది. ఛార్జీలు తగ్గించే వరకు దీక్ష చేస్తామని హెచ్చరించాల్సింది పోయి.. తమ దీక్షను పట్టించుకోవడం లేదని చెప్పడమేమిటంటున్నారు.
ఆ తర్వాత ప్రభుత్వం 200 యూనిట్ల లోపు కాల్చిన వారికి ఛార్జీలు తగ్గించింది. కిరణ్ మాటలను ఆయుధంగా మార్చుకోవాలని చూసి 200 మీటర్లకు ఎక్కువ కాల్చితే పెట్టుబడిదారులా? అని జగన్ పార్టీ ప్రశ్నించింది. కానీ, ఇది ఫలించలేదు. ఇతర పార్టీల దీక్షలను పట్టించుకున్నట్లుగా జగన్ పార్టీ నేతల దీక్షను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదనే చెప్పవచ్చు. దీక్ష మిగతా పార్టీలకంటే ఆలస్యంగా ప్రారంభమవడమే కాకుండా దీక్షలో అనుభవరాహిత్యం కనిపించిందంటున్నారు. జనంలోకి వెళ్లాలనే ఒత్తిడిలో జగన్ పార్టీలో కొంత గందరగోళం కనిపిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications