నువ్వా-నేనా: వైయస్ జగన్ పార్టీలో ఆధిపత్య పోరు

నియోజకవర్గ ఇన్‌చార్జి కోసం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రాధ, వెంకన్నలు పోటీ పడుతున్నారు. వైయస్ పాదయాత్ర చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌లో ఈ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తొలుత రాధ వర్గీయులు చేపట్టిన బైక్ ర్యాలీలో జిల్లా పరిశీలకుడు పాల్గొన్నారు. దీంతో వెంకన్న వర్గానికి చెందిన నేతలు అబ్జర్వర్ వద్దకు వెళ్లి ఒక వర్గం కార్యక్రమంలో పాల్గొనడమేంటని నిలదీశారు.
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం జిల్లా నేత మహేందర్ రెడ్డి ఇంటికి అద్దాలను పగులగొట్టారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
కృష్ణా జిల్లా మైలవరం పార్టీలో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. మైలవరంలో కొద్దిరోజుల్లో జరిగే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర సందర్భంగా బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటులో గొడవలు ఆరంభమయ్యాయి. పార్టీలోని గ్రూపుల నాయకులు పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్ బాబు ముందుగా ప్లెక్సీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఇటీవల ఆ పార్టీలో చేరిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అనూహ్యంగా తన అనుచరులతో సోమవారం మైలవరంలో రంగప్రవేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఫ్లెక్సీల ఏర్పాటులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం జ్యేష్ఠ వర్గీయులు బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించి వైయస్ పాదయాత్ర చేపట్టి పదేళ్లు అయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే సమయంలో జోగి వర్గీయులు ర్యాలీగా వచ్చి ధర్నాకు దిగారు. దాంతో జ్యేష్ఠ అనుచరులు జోగి వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. పోలీసుల జోక్యంతో వివాదం సమసిపోయింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!