జగన్, తెలంగాణ: నిర్ణయాలకు కాంగ్రెస్ వెనుకంజ!

మంత్రి వర్గ విస్తరణపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తే అవసరమైనప్పుడు చేస్తామని గతంలో చెప్పారు. అయితే, కిరణ్ మాత్రం మంత్రివర్గంలో తన మార్క్ కోసం విస్తరణ కోసం మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, పార్టీ పెద్దలు మాత్రం జగన్, తెలంగాణ అంశం కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లుతున్నారట.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కాంగ్రెసు పార్టీ వరుసగా ఎమ్మెల్యేలను జగన్‌కు, తెరాసకు కోల్పోతోంది. ప్రధానంగా పలువురు జగన్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలో అధికార పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. మరికొందరు జగన్ వైపు, తెలంగాణ వాదం నేపథ్యంలో తెరాస వైపుకు చూస్తున్నారని భావిస్తున్నారు.
ఇలాంటి సమయంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు. విస్తరిస్తే అసంతృప్తులు జగన్, తెరాసల వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనతోనే విస్తరణకు నో చెబుతున్నారట. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు మద్దతు పలికే విషయంలో కూడా అధిష్టానంలో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు.
ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణ కోసం పట్టుబట్టిన ముఖ్యమంత్రి కిరణ్ ఇప్పుడు అందుకు సిద్ధంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తన శాఖను మార్చాలని చెప్పినా అంగీకరించలేదని అంటున్నారు. ఎవరికి ఏ శాఖ మార్చినా, ఎవరిని తీసుకున్నా తీసుకోకపోయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెసు పెద్దలు అభిప్రాయపడుతున్నారు. జగన్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేలపై వేటు వేసి ఎన్నికలకు వెళదామన్న అది జగన్‌కు లాభిస్తుందనే భయం అధికార పార్టీలో ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications