కాంగ్రెసు వ్యూహం: వైయస్‌కు సలాం, షర్మిల టార్గెట్

ఇంతకు ముందు ఆర్థిక మంత్రి ఆనం నారాయణ రెడ్డి వైయస్ కుటుంబ సభ్యులపై చేసిన దాడికి దీన్ని కొనసాగింపుగా భావిస్తున్నారు. స్వయానా బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారు. రక్షణ స్టీల్స్ డైరెక్టర్లు, కార్యాలయాల అడ్రసులు చూస్తే అవి ఎవరివో తెలుస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు.
రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు వ్యవహారం మంత్రివర్గం దృష్టికి రాలేదన్నారు. ఉత్తర్వులు వచ్చినప్పుడు తనతో సహా కొందరు మంత్రులు తప్పు పట్టారని, రక్షణ స్టీల్స్ ఎవరిదో, కొండల రావు ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. రక్షణ స్టీల్స్ వ్యవహారంపై ఎవరూ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు.
కుటుంబ సభ్యుల బ్లాక్ మెయిలింగుతో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పొరపాట్ల వల్లే పలు తప్పిదాలు జరిగాయని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. వైయస్‌కు మంచి సంతానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ మంచివాడనుకున్నామని అందుకే సిఎం కావాలని అందరం కోరుకున్నామని, అందుకోసం సంతకాలు చేశామని కానీ ఆయన ఇలాంటి దుర్మార్గుడని తర్వాత తెలిసిందన్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెసు పార్టీకి ఇబ్బందిగా మారాయని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా రక్షణ స్టీల్స్ విషయంలో అనిల్ కుమార్‌పై ఆరోపణలు చేస్తూ షర్మిలను లక్ష్యం చేసుకుంది. ఇంతకు ముందు తెలుగుదేశం శానససభ్యుడు రేవంత్ రెడ్డి షర్మిలకు సవాల్ విసిరారు. షర్మిలకు ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా బుధవారం నాడు టిడిపి నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు జగన్‌పై ఆరోపణలు చేశారు.
'జగన్ ఒక దోపిడీ దొంగ' అని తెలుగు దేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ - రాష్ట్రంలో జరుగుతున్న రకరకాల దోపీడీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ బాధ్యుడని గాలి ఆరోపించారు. అనేక అవినీతి పనులు చేశాడు కాబట్టే జగన్ జైల్లో ఉన్నాడు. అలాంటి అవినీతి పరుడికి బెయిల్ దాఖలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications