హరి, ఎన్టీఆర్ డుమ్మా: కళ్యాణ్‌రామ్ కూడా ఆగాడా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర ముగింపు సభకు పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో బహిరంగ సభకు చేసిన ఏర్పాట్లలో నారా లోకేష్ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేయడం హరికృష్ణకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు, తమ బొమ్మలను వాడకపోవడంపై కూడా ఆయన కినుక వహించినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభకు హాజరు కాలేదు.
చంద్రబాబు ముగింపు సభకు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా హరికృష్ణ వెళ్తారని శుక్రవారం సాయంత్రం వరకు ప్రచారం సాగింది. అయితే, హరికృష్ణ హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాకూడదని మొదటే అనుకున్నట్లు చెబుతున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులంతా ఈ సభకు దూరంగా ఉన్నారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని హరికృష్ణ తనను సంప్రదించిన తెలుగుదేసం పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం.

చంద్రబాబు సభకు హాజరు కావడానికి మొగ్గు చూపిన హీరో కళ్యాణ్ రామ్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ను హరికృష్ణ నిలువరించినట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ విశాఖపట్నం జిల్లా వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. దీంతో కళ్యాణ్ రామ్ చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు, తప్పకుండా సభకు హాజరు కానున్నట్లు ప్రచారం సాగింది.
ఇక, చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొనేందుకు నందమూరి హీరోలు బాలకృష్ణ, తారకరత్న విశాఖపట్నం చేరుకున్నారు. సభలో పాల్గొన్నారు. బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ చంద్రబాబుతో పాటు సభలో పాల్గొన్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రమైనట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications