తెలంగాణకు ఇక్కడి సన్నాసులే అడ్డు: కెసిఆర్

తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తామని చెప్పిన రాజకీయ నాయకులు వెనక్కి తగ్గారని, కేవలం 12 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారని, వారిలో పది మంది తమ పార్టీ శాసనసభ్యులేనని, రాజీనామా చేసిన శాసనసభ్యులను ప్రజలు అద్భుతమైన మెజారిటీతో మళ్లీ గెలిపించారని ఆయన గుర్తు చేశారు. పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఎకసెక్కం చేశారని, అమానించారని, ఇది మనుగడ సాగించదని అన్నారని, అయితే పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం అద్భుతమైన ఉన్నత శిఖరాలకు చేరుకుందని ఆయన అన్నారు.
పుష్కర కాలంలో ఎన్నో విజయాలు సాధించామని తెలంగాణ సాధించుకున్నామని, అయితే సీమాంధ్రులు రాజీనామాల డ్రామాతో అడ్డుకున్నారని, అయితే రాజీనామాలు చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రజాప్రతినిధులు వీపులు చూపించి పారిపోయారని ఆయన అన్నారు. ఉద్యమాన్ని పన్నెండేళ్లు నిలబెట్టి ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమం సాగుతుందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని కుట్రలు, కుతంత్రాలతో ఆపలేరని ప్రధానికి ఇక్కడి నుంచి తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. లక్ష్యాన్ని ముద్గాడే వరకు ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. తెరాసను ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా కెసిఆర్ ఏడోసారి ఎన్నికయ్యారు. కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నాయని నర్సింహారెడ్డి ప్రతినిధుల సభలో ప్రకటించారు. తనను ఎన్నుకున్నందుకు అందరికీ కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బక్కోని మీదనే మల్లా బరువెత్తిండ్రు, ఫరవాలేదు, తెలంగాణ కోసం బరువును మోద్దాం అని కెసిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications