పోటాపోటీ: బాబుకు 3గురు షాక్, కిరణ్‌కు టి - సెగ
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అకాల వర్షాలు కురిసినా వేడి తగ్గలేదు. శనివారంనాడు వేడి వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అనిపించే విధంగా నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలో పోటీ పడినట్లు బహిరంగ సభలు నిర్వహించాయి. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతలు తెలంగాణలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొనగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం బహిరంగ సభలో పాల్గొన్నారు.
చంద్రబాబు తన పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో బహిరంగ సభను నిర్వహించారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన చంద్రబాబు శనివారం బహిరంగ సభ ద్వారా దాన్ని ముగించారు. ఆయన తన పాదయాత్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ప్రధానంగా లక్ష్యం చేసుకున్నారు. కాంగ్రెసు, తెరాసలపై కూడా విరుచుకుపడ్డారు. అయితే, ముగింపు సభ సందర్భంగా ముగ్గురు పోలిట్‌బ్యూరో సభ్యులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. హరికృష్ణ, కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు సభకు డుమ్మా కొట్టారు.
నందమూరి హరికృష్ణ వస్తారని ప్రచారం సాగినప్పటికీ దూరంగా ఉండడానికే ఆయన సిద్ధపడినట్లు అర్థమవుతోంది. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న వారసత్వ పోరు కారణంగానే ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తమ అంతర్గత పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తారనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు ముగింపు సభకు బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ హాజరయ్యారు.

మోత్కుపల్లి నర్సింహులుకు, కడియం శ్రీహరికి మధ్య ఇటీవల విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. వారిద్దరు పరస్పరం వాగ్బాణాలు విసురుకున్నారు. దాంతో కడియం శ్రీహరి ముగింపు సభకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో దాడి వీరభద్రరావు చంద్రబాబుపై అలిగారు. అప్పటి నుంచి ఆయన దూరంగానే ఉంటున్నారు. చంద్రబాబు ముగింపు సభలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, కోడెల శివప్రసాదరావు, రేవంత్ రెడ్డి వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తెరాసపై కూడా వాగ్బాణాలు సంధించారు.
కాగా, అమ్మహస్తం, ఇందిరమ్మ కలలు పేర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనలు జరుపున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం కరీంనగర్ జిల్లాలోని మాజీ ప్రధాని పివి నర్సింహారావు స్వగ్రామం వంగరలో ప్రారంభించారు. ఈ సభలో ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు తెలంగాణ సెగ తగిలింది. సభలో తెలంగాణ నినాదాలు వినిపించాయి. ఆ నినాదాలు చేసిన తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, వేదికపై నుంచి ప్రజలంతా వింటుండగా పొన్నం ప్రభాకర్ తన ప్రసంగంలో తెలంగాణవాదం వినిపించారు. తెలంగాణకు అడ్డుపడవద్దని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ఇవ్వకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా లాభం లేదని ఆయన కచ్చితంగా చెప్పారు. తెలంగాణ పరిష్కారం తన చేతుల్లో లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. వంగరలో ఆయన పివి నర్సింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇదిలావుంటే, తెరాస 12వ వార్షికోత్సవ సభ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో జరిగింది. తెరాస ఈ సభలో పలు తీర్మానాలు చేసింది. తన ప్రారంభ, ముగింపు ప్రసంగాల్లో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు - కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తెరాస నిర్ణయానికి సభ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించడం ద్వారా తెలంగాణ సాధించుకోవాలనే తన వ్యూహాన్ని కెసిఆర్ సభలో వెల్లడించారు. యేటా ఇదే రోజున తెరాస వార్షికోత్సవ సభ జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఇక వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్‌ను వుణికిపుచ్చుకుంటూ రంగారెడ్డ జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో తమ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని ఆమె దీమా వ్యక్తం చేశారు. మొత్తమ్మీద, రాజకీయ పార్టీల నేతలు ఇప్పటి నుంచే ఎన్నికల కదనరంగంలోకి దూకినట్లు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications