బాబు పాదయాత్ర ముగిసింది.. బస్సుయాత్ర మిగిలింది!

మిగిలిన ఏడు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. జూన్ నెలలో బస్సు యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. బాబు బస్సు యాత్ర ద్వారా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత మిగిలిన 16 జిల్లాల్లో మిగిలిపోయిన శాసనసభ నియోజక వర్గాల్లో కూడా పర్యటించాలని బాబు యోచిస్తున్నారట.
ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్నందున బస్సు ద్వారా అయితే అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన 'మీ కోసం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈసారి యాత్ర కూడా అదే తీరులో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సుమారు ఆరు నెలలపాటు మిగిలిన అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించాలనేది చంద్రబాబు వ్యూహం.
నిరంతరాయంగా ప్రజల్లో ఉండటం ద్వారా తాము చెప్పదల్చుకున్న విషయాలను బలంగా వారికి చేరవేయవచ్చని, అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపర్చవచ్చన్న భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. రెండో విడత యాత్ర చేపట్టడానికి ముందు మే నెలలో తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడానికి వినియోగించాలని భావిస్తున్నారు. మే నెలఖరులో హైదరాబాద్‌లో మహానాడును నిర్వహించిన అనంతరమే ఆయన బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications