అసమ్మతి మంట, తెలంగాణ: ఢిల్లీకి సిఎం కిరణ్ రెడ్డి

బంగారు తల్లి పథకం రేపిన చిచ్చు నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె. జానారెడ్డి, డిల్ రవీంద్రారెడ్డి, వట్టి వసంతకుమార్ ముఖ్యమంత్రిపై అసమ్మతితో రగిలిపోతున్న విషయంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు నివేదిక పంపినట్లు సమాచారం ముఖ్యమంత్రి తీరును, వ్యవహారశైలిని తప్పు పడుతూ బొత్స తన నివేదికను సమర్పించినట్లు చెబుతున్నారు.
మంత్రుల అసంతృప్తిపై కిరణ్ కుమార్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కర్ణాటక శానససభ ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ముఖ్యమంత్రి తీరుపై అధిష్టానం చెవులు కొరికినట్లు చెబుతున్నారు.
కాగా, తెలంగాణ అంశాన్ని కూడా తేల్చాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ పార్లమెంటు సభ్యులు ఆందోళనలు చేపట్టడం, తెలంగాణ జెఎసి సంసద్ యాత్రను చేపట్టడం వంటి విషయాల నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని తేల్చాలనే ఉద్దేశంతో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పార్టీ అధిష్టానం చర్చించే అవకాశాలున్నాయి.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులకు కూడా అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి వర్గంలో మార్పులుచేర్పులు చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కీలకమైన వ్యవహారాలపై చర్చకే ముఖ్యమంత్రిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications