హైకోర్టు నిలువునా చీలింది: తెలంగాణపై సుప్రీంకోర్టు

సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్ర హైకోర్టులో జరిగిన విధ్వంసంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ - ఈ కేసును తామే విచారిస్తామని స్పష్టం చేసింది. సకల జనుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులు దీక్ష చేసిన సందర్భంగా జరిగిన విధ్వంసంపై పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది, విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
మొదట రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వెంకట రమణి ఈ కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ సింఘ్వీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర హైకోర్టు నిట్టనిలువునా చీలిందని, ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టుకు ఎలా బదిలీ చేస్తామని ప్రశ్నించారు. ఒకవేళ హైకోర్టుకు బదిలీ చేసినా.. ఇది ఒక ధర్మాసనానికి వెళితే ఆ ధర్మాసనం తెలంగాణకు అనుకూలమని, వేరొక ధర్మాసనానికి వెళితే అది తెలంగాణకు వ్యతిరేకమని అంటారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంశంలో న్యాయమూర్తులు కూడా జోక్యం చేసుకుంటున్నారని, వారికి కూడా తెలంగాణను ఆపాదించారని తెలిపారు. హైకోర్టులో ఆందోళన సందర్భంగా జరిగిన విధ్వంసాన్ని తాము గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు తదుపరి విచారణను ఆగస్టు రెండో వారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications