చిరంజీవి, పురంధేశ్వరి హిట్, పని చేయని మోడీ ఫ్యాక్టర్
బెంగళూరు: కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఫ్యాక్టర్ పని చేసినట్లుగా తెలుస్తోంది. వారు ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇటీవల చిరు, పురంధేశ్వరిలో కర్నాటక ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు. వీరితో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు రఘువీరా రెడ్డి తదితరులు కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేశారు.
కాంగ్రెసు హవాతో పాటు చిరంజీవి, పురంధేశ్వరి ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గాల్లో కాంగ్రెసు చాలా ముందంజలో ఉంది. చిరు ఇరవై నుండి ఇరవై అయిదు నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. బెంగళూరు గ్రామీణ, బెంగళూరు రూరల్, బళ్లారి తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. బళ్లారిలో బిఎస్సార్ కాంగ్రెసు పార్టీని కాదని ప్రజలు కాంగ్రెసు పార్టీకి పట్టం కట్టారు. అక్కడ కాంగ్రెస్ గాలి వీచింది.

కేంద్రమంత్రి పురంధేశ్వరి కూడా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెసు గాలి వీచింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇద్దరి సభలకు, ప్రచార ర్యాలీలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. చిరంజీవిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. పోలీసులు వారిని అదుపు చేయలేని పరిస్థితి కూడా కనిపించింది.
మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ బిజెపికి కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఆయన ప్రచారం చేసిన బసవనగుడిలోనే బిజెపి అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. దీంతో నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ పని చేయనట్లుగానే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications