ఫ్లెక్సీలో లేని చిరంజీవి ఫోటో: నిరసన, సర్ది చెప్పిన దానం

ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఫోటో లేదు. దీంతో చిరంజీవి వర్గం నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో ముఖ్య నేత అయిన చిరంజీవి ఫోటోను పెట్టక పోవడమేమిటని వారు ప్రశ్నించారు. వారికి కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ సర్ది చెప్పారు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు. దీంతో చిరు వర్గం చల్లబడింది.
అయోమయం: పొన్నం
కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, జానా రెడ్డి, మహీధర్ రెడ్డి, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకట రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. కాంగ్రెసు పెద్దల వ్యాఖ్యలతో తెలంగాణపై అయోమయం ఏర్పడుతోందన్నారు. తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు బలపడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు పార్టీని వీడొద్దని హితవు పలికారు. పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడుదామన్నారు.
వలసలతో ఇబ్బందులు లేవు: షబ్బీర్
తమ పార్టీ నుండి ఇతర పార్టీలోకి వలసలు జరిగినా వచ్చే ఇబ్బందులేమీ లేవని శాసనమండలి సభ్యుడు షబ్బీర్ అలీ అన్నారు. తమ పార్టీ మునిగిపోయే నావ కాదని, ఇతర పార్టీలే అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై రెండు నెలల్లో నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి పార్టీలే తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
అధిష్టానం నిర్ణయం: ఆనం
కళంకిత మంత్రులపై నిర్ణయం అధిష్టానానిదేనని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకే సమావేశమన్నారు. కాగా, విస్తృతస్థాయి సమావేశం పదిన్నర గంటలకు ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications