కాంగ్రెసులోనే కార్యకర్తగా: ధర్మాన, విహెచ్‌పై విసుర్లు

 Dharmana Prasad Rao
శ్రీకాకుళం: తాను కాంగ్రెసులోనే ఉంటానని, సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. తమ కాంగ్రెసు పార్టీ నాయకుడు వి. హనుమంతరావుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. మంత్రివర్గ నిర్ణయం మేరకే వాన్‌పిక్ సంస్థకు భూకేటాయింపులు జరిగాయని, కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులను తనను ఒకే గాటన కట్టడం సరైంది కాదని ఆయన అన్నారు.

మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయానికి విరుద్ధంగా భూముల కేటాయింపు జరిగిందని సీబీఐ ఆరోపించిందని, వాస్తవానికి మంత్రి వర్గ ఆమోదం మేరకే కేటాయింపులు జరిగాయని, ఈ విషయాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నానని, కచ్చితంగా నిరపరాధిగా బయట పడతానని ధర్మాన చెప్పారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. అందువల్లనే చివరి ప్రయత్నంగా అధిష్ఠానానికి కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక పంపించారని చెప్పారు. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన తాము కళంకితులం కాదని, ఆరోపణలు కోర్టులో రుజువైతేనే కళంకితులమవుతామని వ్యాఖ్యానించారు. ధర్మానకు ఏ విధంగా అరెస్టు లేకుండా వెసులుబాటు కల్పించారో తనకూ అదే వెసులుబాటు కల్పించాలని మాజీ మంత్రి మోపిదేవి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారని, దాన్ని తోసిపుచ్చుతూ కోర్టు అందుకు వివరణ ఇచ్చిందని, తాను నిర్దోషినని అప్పుడే తేలిపోయిందని ధర్మాన అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీరును ధర్మాన విమర్శించారు. అధిష్ఠానానికి విధేయుడినని, సోనియాకు ఆప్తుడినని వీహెచ్ చెప్పుకోవడంపై ఆయన స్పందించారు. పార్టీలో ఉన్నవారంతా అధిష్ఠానానికి విధేయులమేనని, పార్టీ నాయకులందరికీ విధేయత ఉంటుందని చెప్పారు. విధేయతతో పాటు ప్రజా బలం కూడా ఉండాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు లేకుండా విధేయతపైనే విహెచ్ ఆధారపడుతున్నారని ఆరోపించారు.

పార్టీని పటిష్ఠం చేయడానికి అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని ధర్మాన స్పష్టం చేశారు. తన రాజీనామాతో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందంటే ఏ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. ఎలాంటి పదవి లేకపోయినా సామాన్య కార్యకర్తగా పార్టీ పటిష్ఠతకు పనిచేస్తానని చెప్పారు. జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ధర్మాన మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+