కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ: కొలిక్కి రాని తెలంగాణ

చత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల దాడి, ఆహారభద్రతా బిల్లు, తెలంగాణ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణపై దాదాపు గంటసేపు చర్చ జరిగింది. తెలంగాణపై చర్చకు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను, తెలంగాణ అంశంపై పరిణామాలను, పార్టీ సీనియర్ నేత కేశవరావుతో పాటు ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్న విషయాన్ని కోర్ కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పార్టీకి నష్టం జరగకుండా చూడాలని కోర్ కమిటీ ఆజాద్‌కు సూచించినట్లు సమాచారం. తెలంగాణ అంశంపై శానససభ సమావేశాల తర్వాత దృష్టి సారించాలని కోర్ కమిటీ అనుకున్నట్లు సమాచారం. తెలంగాణపై మరోసారి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భావించినట్లు చెబుతున్నారు. శానససభ సమావేశాల తర్వాత ఈ సమావేశం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
కాగా, సోమవారంనాడు యుపిఎ సమన్వయ కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఆహార భద్రతా బిల్లుపైనే కాకుండా తెలంగాణపై కూడా చర్చించాలని కాంగ్రెసు కోర్ కమిటీ అనుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో పార్టీకి ఎదురవుతున్న సవాళ్లపై కోర్ కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.
మావోయిస్టుల అణచివేతకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో మావోయిస్టుల అణచివేతకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఆహారభద్రత బిల్లు ఆమోదానికి ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, అది కుదరకపోతే ఆర్డినెన్స్ జారీ చేయాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications