కోర్ కమిటీ భేటీ: తెలంగాణపై చర్చ?, ఆజాద్‌కు పిలుపు

తెలంగాణతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కోర్ కమిటీలో చర్చిస్తారని అంటున్నారు. చత్తీస్‌గడ్‌లో నక్సలైట్ల దాడి, పార్లెమెంటు ప్రత్యేక సమావేశాల గురించి సమావేశంలో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. యాభై ఏళ్లుగా కాంగ్రెసులో ఉంటూ వచ్చిన కె. కేశవరావుతో పాటు ఇద్దరు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, జి. వివేక్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో పరిణామాలపై కోర్ కమిటీలో చర్చిస్తారని అంటున్నారు.
అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన తీరు చూస్తుంటే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఏ విధమైన నిర్ణయం వెల్లడించబోవడం లేదని తెలుస్తోంది. తమ పార్టీ పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వెళ్లడానికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే సంకేతాలను కిరణ్ కుమార్ రెడ్డి తన మాటల ద్వారా ఇచ్చారు.
నిజానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేవారిని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా, వెళ్లేవారు వెళ్తారు, చేయి పట్టుకుని ఆపుతామా అనే పద్ధతిలో వారిద్దరు మాట్లాడుతున్నారు. ఇదే తరహా వైఖరిని తెలంగాణ విషయంలోనూ అనుసరించడానికి వారు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
మరో వైపు, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 14 మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేయలేదు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మన్మోహన్ సింగ్ శుక్రవారం చెప్పారు. కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications