చిరుకి, బాబుకి తేడా అదే: ఓటేసి పిచ్చోళ్లయ్యారని షర్మిల

పేద ప్రజలపై పన్నుల భారం మోపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వసూల్ రాజాలా తయారయ్యారన్నారు. ముఖ్యమంత్రికి, చంద్రబాబులకు పేద ప్రజల సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. వీరిద్దరు కుమ్మక్కై జగన్‌ను వేధిస్తున్నారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రస్తుత పాలకులు వాటిని తుంగలో తొక్కుతున్నారన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షమవుతుందన్నారు. చంద్రబాబుపై నమ్మకం లేకే ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలలోకి వలస వెళ్తున్నార్నారు. కిరణ్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. రోజు రోజుకు బాబు ప్రజల విశ్వాసం కోల్పోతున్నారన్నారు. ఇంతకాలం టిడిపిలో నిజాయితీగా బతికిన నేతలకు బాబు మీద నమ్మకం పోయిందన్నారు. వాళ్లు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక టిడిపిని వీడుతున్నారన్నారు.
ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్లను చేసి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతే, ఈ చంద్రబాబు టిడిపికి ఓటేసిన కోట్ల మంది ప్రజలను పిచ్చోళ్లను చేసి తెరవెనుకాల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారన్నారు. పాదయాత్ర 167వ రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పారుపల్లి అడ్డరోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి డి.ముప్పవరం, సమిశ్రగూడెం మీదుగా నడుచుకుంటూ షర్మిల నిడదవోలు నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ నుంచి నడుచుకుంటూ గుర్రప్పాడు గ్రామం వరకు యాత్ర చేశారు.












Click it and Unblock the Notifications