ఎపిని వదిలేసిన సోనియా: జగన్, కెసిఆర్‌లపై ఆశలు

ఎన్నికలకు ముందు తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నిర్ణయం తీసుకోదనే విషయం దాదాపుగా తేలిపోయినట్లే. ఎన్నికలకు ముందు తెలంగాణ రాదని ఆర్‌ఎల్‌డి నేత, కేంద్ర మంత్రి అజిత్ స్పష్టంగానే చెప్పారు. ఎన్నికలకు ముందు తెలంగాణ వస్తే తల నరుక్కుంటానని కాంగ్రెసును వీడి ఇటీవలే తెరాసలో చేరిన కె. కేశవ రావు అన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇవ్వబోదని కొన్నాళ్లుగా చెబుతూ కెసిఆర్ నాయకులకు, తెలంగాణ ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.
తెరాస తెలంగాణ అత్యధిక పార్లమెంట స్థానాలు గెలుచుకుంటే ఎన్నికల తర్వాత అవసరమైతే తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి మద్దుతు పొందవచ్చునని సోనియా గాంధీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కేశవరావుతో పాటు ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరడాన్ని తెలుగుదేశం పార్టీ ఈ దృష్టి కోణంతోనే చూస్తోంది. ఆ మధ్య కేశవరావు సోనియాతో భేటీ అయ్యారు. తెలంగాణపై నిర్ణయం రాబోదనే కేశవ రావుకు సోనియా స్పష్టంగానే చెప్పినట్లు సమాచారం.
వైయస్ జగన్ కూడా ఎన్నికల తర్వాత తాను యుపిఎకు మద్దతు ఇస్తానని చెప్పారు. సీమాంధ్రలో తమ పార్టీ విజయం సాధించకపోయినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచినా ఫరవా లేదనే పద్ధతిలో కాంగ్రెసు అధిష్టానం వ్యవహరిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గెలువకుండా ఉండడమే కాంగ్రెసుకు కావాల్సి ఉందని అంటున్నారు.
బలమైన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు కొంత మందైనా గెలుస్తారనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉందని అంటున్నారు. కొన్ని సీట్లు గెలిచినా, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసల మద్దతు పొందవచ్చునని గట్టి నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు. విజయానికి తగిన వ్యూహరచన చేసుకుంటూనే వైయస్ జగన్, కెసిఆర్‌లపై ఆధారపడాల్సి వస్తే వదులుకోకూడదని సోనియా అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
కెసిఆర్‌తో ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం ఒప్పందం చేసుకుందని తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా బిజెపి కూడా అనుమానిస్తోంది. అందుకే, బిజెపి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో కెసిఆర్‌ను దెబ్బ తీస్తూ తెలంగాణలో బలం పుంజుకునే వ్యూహంలో బిజెపి ఉంది. కనీసం ఐదు సీట్లయినా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అందుకే, తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపితో గానీ సిపిఐతో గానీ ఎన్నికల పొత్తుకు కెసిఆర్ ఇష్టపడడం లేదని అంటున్నారు.
కెసిఆర్‌కు సోనియా దేవత అని, కేశవరావు దేవదూత అని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నేత ఇనుగాల పెద్దిరెడ్డి చెప్పారు. కెసిఆర్ కాంగ్రెసు అధిష్టానం ఒప్పందం చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసి కొడుతుందా, ఫలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications