బెట్టు వీడిన భీష్ముడు అద్వానీ: బిజెపి సంక్షోభానికి తెర
న్యూఢిల్లీ: ఎల్‌కె అద్వానీ రాజీనామాలతో బిజెపిలో నెలకొన్న సంక్షోభం సమసిపోయింది. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు కలిసి అద్వానీని ఒప్పించారు. రాజీనామాలను అద్వానీ ఉపసంహరించుకున్నారని, మునుపటి బాధ్యతల్లో కొనసాగుతారని రాజ్‌నాథ్ సింగ్ అద్వానీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయాన్ని మీడియాకు చెప్పాలని తనకు అద్వానీ చెప్పినట్లు ఆయన తెలిపారు.
మునుపటి బాధ్యతల్లో అద్వానీ కొనసాగుతారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. త్వరలో పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అద్వానీ లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. తమ విన్నపాన్ని అద్వానీ మన్నించారని ఆయన చెప్పారు. రాజీనామాలు వద్దన్న పార్టీ నిర్ణయాన్ని అద్వానీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అద్వానీని అన్ని స్థాయిల్లోనూ సంప్రదించనున్నట్లు ఆయన తెలిపారు.

అద్వానీ మార్గదర్శనం తమకు కావాలని ఆయన అన్నారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని గౌరవించాలని ఆర్ఎఎస్ఎస్ చీఫ్ భగవత్ అద్వానీకి సూచించారు. ఆర్ఎఎస్ఎస్ చీఫ్ కూడా అద్వానీతో మాట్లాడారని ఆయన చెప్పారు. 24 గంటల పాటు కొనసాగిన సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మోడీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించినంత మాత్రాన ప్రధాని అభ్యర్థి కాబోరని నేతలు అద్వానీకి నచ్చజెప్పినట్లు సమాచారం.
నిన్ననే చెప్పా: మోడీ
అద్వానీ రాజీనామాలను ఉపసంహరించుకుంటారని తాను నిన్ననే చెప్పానని గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీ అన్నారు. అద్వానీ రాజీనామా నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్విట్టర్‌లో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
మంచి పరిణామం: జెడి (యు)
అద్వానీ రాజీనామా ఉపసంహరణ మంచి పరిణామమని ఎన్డీయె భాగస్వామ్య పార్టీ జెడి (యు) వ్యాఖ్యానించారు. అద్వానీ రాజీనామాను ఉపసంహరించుకోవడం ఎన్డీయెకు మంచిదని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications