ఇవాళ్ల దాసరి, రేపు చిరంజీవి: కెపి రెడ్డయ్య వ్యాఖ్య
హైదరాబాద్: సినిమావాళ్లకు రాజకీయాలపై, ప్రజా సమస్యలపై అవగాహన ఉండదని, ఇందుకు కేంద్ర మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు బొగ్గు కుంభకోణానికి పాల్పడడమే నిదర్శనమని కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కెపి రెడ్డయ్య అన్నారు. ఇవాళ్ల దాసరి నారాయణ రావు వంతు, రేపు చింరజీవి వంతు కూడా రావచ్చునని ఆయన బుధవారంనాడు అన్నారు.
సినిమావాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వకూడదని ఆయన సూచించారు. వారికి డబ్బు సంపాదనే తప్ప ప్రజా సమస్యలు పట్టవని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.

గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు బొగ్గు కుంభకోణంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సిబిఐ అధికారులు ఆయన నివాసంలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. బొగ్గు స్కామ్‌పై దర్యాప్తును ముమ్మరం చేసిన సిబిఐ మరో ముందడుగు వేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాను విచారించేందుకు సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెసులో పార్టీని విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయన కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పర్యాటక శాఖను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవిపై ఆరోపణలు ప్రారంభమయ్యాయి.












Click it and Unblock the Notifications