వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ వ్యూహం: తెలంగాణవాద పార్టీలు ఉక్కిరిబిక్కిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

k chandrasekhar rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహానికి తెలంగాణవాద పార్టీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన వ్యూహంలో చిక్కుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఆయన సిపిఐ, బిజెపిల మీద తనది పైచేయిగా ఉండేట్లు చూసుకుంటున్నారు. కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి కూడా తెరాస వ్యూహానికి పనికి వస్తోంది. ఇక, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చెప్పనే అక్కరలేదు.

తెలంగాణ జెఎసి తెలుగుదేశం పార్టీకి కనీసం అహ్వానం కూడా పలకడం లేదు. అయినా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ జెఎసి ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాల్సిన అనివార్య స్థితి ఏర్పడుతోంది. తమ కార్యాచరణ గురించి సిపిఐ, బిజెపిలకు మాత్రం తెలియజేస్తోంది. ఆ పార్టీల మద్దతు కూడా కోరుతోంది. కానీ, చివరకు వచ్చేసరికి తెరాసది ప్రతి విషయంలో పైచేయి అవుతోంది. శుక్రవారం తెలంగాణ జెఎసి నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా ఇదే జరిగింది.

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్ పనిచేస్తున్నారని ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. నిజానికి, ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని అదే. ఆయన వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించే దిశగానే సాగుదామని ప్రజలకు కూడా చెబుతున్నారు. ఈ స్థితిలో ఆయనకు బిజెపి, సిపిఐలు అడ్డం వస్తున్నాయి. బిజెపి తెలంగాణలో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి బలపడకుండా చూడాల్సిన అనివార్య స్థితిలో కెసిఆర్ పడ్డారు. ఈ స్థితిలో చలో అసెంబ్లీని ఆయన అస్త్రంగా వాడుకున్నారు.

ఎన్నికలే లక్ష్యంగా బిజెపి, సిపిఐలు కూడా పనిచేస్తాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అందువల్ల ఆ పార్టీలు బలపడకుండా చూడాల్సిన అవసరం రాజకీయంగా కెసిఆర్‌కు ఏర్పడింది. దాంతో కెసిఆర్ ఎవరినీ సంప్రదించకుండా రేపు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఏకపక్షంగా కెసిఆర్ బంద్‌కు పిలుపునివ్వడాన్ని వ్యతిరేకించి సిపిఐ, బిజెపి చేసేదేమీ లేదు. ఆ కార్యక్రమంలో పాల్గొనకున్నా వ్యతిరేకించలేవు. కెసిఆర్‌ను నిత్యం తిట్టిపోసే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా కార్యక్రమానికి వ్యతిరేకంగా పనిచేయలేరు. కాకపోతే, సిపిఐ, బిజెపిల కన్నా ఘాటుగా కెసిఆర్‌పై దుమ్మెత్తి పోయగలరు. ఆ విషయం కెసిఆర్‌కు తెలుసు. తనకు కావాల్సింది తన పార్టీని మరింత బలోపేతం చేయడం మాత్రమే.

అయితే, ఇతర పార్టీలకు వస్తున్న సమస్య ఏమిటనేది ప్రశ్న. కెసిఆర్‌కు గానీ, ఆయన పార్టీకి తెరాసకు గానీ తెలంగాణ రాష్ట్ర సాధన అనే నినాదం ఒక్కటే ఉంది. ఏది చేసినా దానికోసమే అని చాటుకోగలరు. బిజెపి, సిపిఐ పార్టీలకు ఆ అవకాశం లేదు. చాలా ఎజెండాలో వాటికి తెలంగాణ సాధన ఒక్కటి. ఆ ఒక్క అంశంపై మాత్రమే అవి పనిచేస్తూ పోలేవు కూడా. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే మరింత దారుణం. ముందుకు పోలేదు, వెనక్కి రాలేదు. ఈ స్థితిలో కెసిఆర్ వ్యూహాలు మిగతా పార్టీలపై బాగానే పారుతున్నాయని చెప్పాలి.

English summary

 The Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) is in a strategy to confuse and achieve upper hand on pro - Telangana parties, CPI and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X