ఏం చేద్దాం: తెలంగాణ మంత్రులు, ఎంపీల సమావేశం

తెలంగాణపై పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ సాధన పేరుతో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, ఈ రెండింటిపై చర్చించేందుకు మరోసారి ఈ నెల 18వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. శాసనసభ్యులను, ఇతర మంత్రులను, పార్లమెంటు సభ్యులను ఆహ్వానించి ఈ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అందరూ కలిసికట్టుగా తెలంగాణపై అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని అనుకున్నారు.
సమావేశంలో మంత్రి జానారెడ్డితో పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ వాదనకు దిగినట్లు సమాచారం. చలో అసెంబ్లీ విషయంలో తెలంగాణ మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని రాపోలు ఆనంద భాస్కర్ విమర్శించినట్లు సమాచారం. అయితే, శాంతిభద్రతలు తమ చేతుల్లో లేవని, దానితో తాము ఏమీ చేయలేని స్థితిలో పడ్డామని జానా రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు అధిష్టానం రెండు ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ఈ ప్రతిపాదనలని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలపై కూడా సమావేశంలో మంత్రులు, పార్లమెంటు సభ్యులు చర్చించినట్లు చెబుతున్నారు.
త్వరలో నిర్ణయం: విహెచ్
కాగా, తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బంద్‌ల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఆందోళనల వల్ల వరుసగా సెలవులు వస్తుండడంతో పిల్లల చదువులు పాడవుతున్నాయని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications