పదుల కిమీ నడిస్తేనే..: డెహ్రాడున్‌కు బాబు, జయ హెల్ప్
డెహ్రాడూన్/హైదరాబాద్/చెన్నై: ఉత్తరాఖండ్ వరదల్లో మన రాష్ట్రానికి చెందిన వేలాది మంది చిక్కుకుపోయారు. అందులో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేరుకున్నారు. ఇంకొందరు ప్రత్యేక రైళ్లలో రాష్ట్రానికి వచ్చారు. మన రాష్ట్రానికి చెందిన దాదాపు అరవై మందితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కలిసి మొత్తంగా ఐదు వందల మంది గంగోత్రి వద్ద చిక్కుకుపోయారు.
కొండచరియలు విరిగిపడటంతో దారులు మూసుకుపోయాయి. వారు బయటకు రావాలంటే దాదాపు డెబ్బై కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అన్ని కిలోమీటర్లు నడిస్తేనే వారు ఉత్తర కాశీకు చేరుకుంటారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ సైనికులు ఆ వర్షంలోనే భక్తులను రక్షించే సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

ఇంటికి చేరుకున్న యాత్రికులు
మన రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్‌కు వెళ్లిన భక్తులు పలువురు ఇళ్లకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుకు చెందిన యాభై మంది, కృష్ణా జిల్లాకు చెందిన 25 మంది, అనంతపురం జిల్లాకు చెందిన ఎనిమిది మంది భక్తులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ వరదల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురి ఆచూకీ లభ్యం కావడంలేదు. ఉత్తరాఖండ్ బాధితుల కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. ముఖ్యమంత్రి జయలలిత ఈ మొత్తాన్ని ప్రకటించారు.
బాబు ఉత్తరాఖండ్ పర్యటన
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్లి ఎపి భవన్‌లో బాధితులను పరామర్శించనున్నారు. సోమవారం డెహ్రాడూన్ వెళ్లి, అక్కడ పరిస్థితులను తెలుసుకోనున్నారు. చంద్రబాబు ఈ రోజు ఎపి భవన్ రెసిడెంట్ కమిషన్‌తో మాట్లాడారు. ఉత్తరాఖండ్ వరదల్లో ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం చెప్పలేకపోతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్మీ సేవలు అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications