కెకెతో మంతనాల వ్యూహం: కెసిఆర్‌లో గుబులు

అయితే, నిజంగానే తెలంగాణ ఇస్తారా? లేదంటే, రాయల తెలంగాణ లాంటి మెలిక పెడతారా? అనే విషయాన్ని తెరాస నాయకులు తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణపై 2004 నుంచి నానుస్తూ వస్తున్న కాంగ్రెసు అధిష్టానం కొద్ది కాలం హడావిడి చేసి వెనక్కి పోతుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. కాంగ్రెసు తెలంగాణ సభ విజయవంతం కావడంతో తెరాస దూకుడుకు కాస్తా కళ్లెం పడిందని అంటున్నారు.
తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ కె. కేశవరావుతో కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ ఇచ్చే విషయంపైనా , రాయల తెలంగాణపైనా కెసిఆర్ వైఖరి ఏమిటనే విషయాలను తెలుసుకోవడానికి కూడా కాంగ్రెసు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచీ తెరాస నుంచి కాంగ్రెసులోకి వలసలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇటీవలే తెరాసలో చేరిన కేకే, వివేక్, మందా జగన్నాథం కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చేస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణ జెఎసి నేతలు చాలా మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారతారని ఢిల్లీ వర్గాల అంచనా. దాంతో కెసిఆర్‌తో తన కుటుంబ సభ్యులు, కొంత మంది నాయకులు మాత్రమే మిగులుతారని, దాంతో కెసిఆర్ బేషరతుగా పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి ముందుకు వస్తారని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తెలంగాణపై కాంగ్రెసులో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి సీనియర్ నేత కె.కేశవరావుపై కెసిఆర్ ఆధారపడుతున్నట్లు సమాచారం. అందుకే తన స్వభావానికి విరుద్ధంగా ఆయన తరచూ కెకె ఇంటికి వెళ్తున్నట్లు చెబుతున్నారు.
సిడబ్ల్యుసి సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన కేకేకు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలతో విస్తృతమైన పరిచయాలున్నాయి. ఆయన రెండు రోజుల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఫామ్‌హౌస్ నుంచి ఆదివారం హైదరాబాద్ కొచ్చిన కేసీఆర్ సోమవారం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు జి.జగదీశ్‌రెడ్డి తదితరులతో కలిసి కేకే నివాసానికి వెళ్లారు. ఈ స్థితిలో వేచి చూసే ధోరణిని కెసిఆర్ అవలంబిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications