ట్విస్ట్: ప్రధానిగా మోడీకి అద్వానీ జై, బిజెపిలోకి యడ్డీ?
న్యూఢిల్లీ: ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలో కొత్త ట్విస్ట్. 2014 ఎన్నికల ప్రచార సారథిగా ఎన్నికైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నారట. 2014 ఎన్నికల ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని మోడీ అని అద్వానీ ప్రకటిస్తారనటం ఆ పార్టీలో కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు.
అద్వానీ ఇదే నెలలో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని బిజెపి వర్గాలు తెలిపాయి. మోడీకి అద్వాని ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయని, ఆయన మార్గదర్శకంలోనే నడుస్తారని చెప్పారు.

సమాచారం మేరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్(ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలకులు) మోహన్ భాగవత్ ఇరువురు నేతల మధ్య రాయబారం నెరపి, రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ అభ్యర్థిత్వం వైపు అద్వానీ మొగ్గేలా భాగవత్ ఆయనను చల్లబరుస్తున్నారట. ఇప్పటికే చల్లబడ్డారనే ప్రచారం కూడా సాగుతోంది.
పార్టీని అధికారంలోకి తెచ్చే దిశలో దిశా నిర్దేశనం చేసేందుకు అద్వానీ సిద్ధంగా ఉన్నారంటున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ, అద్వానీలు పార్టీ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లోకసభాపక్ష నేత సుష్మాస్వరాజ్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.
బిజెపిలోకి యడ్యూరప్ప?
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కెజెపి అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తిరిగి బిజెపిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన తన కెజెపిని బిజెపిలో విలీనం చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 17వ తేదిన యడ్డీ విలీన ప్రకటన చేయనున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications