కిరణ్ రెడ్డిపై ఒత్తిడి: మంత్రుల్లో ఎవరి వాదన వారిదే

తెలంగాణ, సీమాంధ్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం విడివిడిగా సమావేశమయ్యారు. నేతలు ఎవరికి వారు తమ మనోభావాలకు అనుగుణంగా రోడ్ మ్యాప్ ఉండాలని ముఖ్యమంత్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. బుధవారం మొత్తం ఈ అంశంపైనే వాడిగా చర్చలు, సమావేశాలు, సమీక్షలు, సంప్రదింపులు జరిగాయి. అధిష్ఠానం నిర్వహించనున్న కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ గురువారం ఢిల్లీ వెళ్ళనున్నారు.
సీమాంధ్ర నేతలు, ఇటు ప్రత్యేక తెలంగాణ కోరుతున్న తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి తమ మనోభావాలు వివరించారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించకుండా రాష్ట్రాన్ని విభజించే సమయంలో కొన్ని నష్టాలతోపాటు, లాభాలు కూడా ఉంటాయని, గతంలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ వంటి వాటిని కూడా ఇలాగే విభజించారని చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణపై ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి మంత్రులతో చెప్పినట్లు సమాచారం.
బుధవారం ఉదయమే మంత్రులు శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ రూపొందించిన ఒక నివేదికను సమర్పించారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు కూడా వారు తమ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో తుది అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ఇరు ప్రాంతాలకు చెందిన వారిని సాయంత్రం క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి విడివిడిగా భేటీ అయ్యారు.
సమైక్యాంధ్ర తరఫున బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదుల్లా, పార్థసారథి, కొండ్రు మురళితోపాటు సీనియర్ శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, గాదె వెంకటరెడ్డి ముఖ్యమంత్రి తమ వాదనలు వినిపించారు. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, ప్రసాద్‌కుమార్, సారయ్యతో పాటు హైదరాబాద్‌కు చెందిన దానం నాగేందర్ తదితరులు ముఖ్యమంత్రికి తమ వైఖరిని వివరించారు. ఈ భేటీకి తెలంగాణ అంశంపై పోరు సాగిస్తున్న సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీ్ధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డితోపాటు, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ రాకపోవడం గమనార్హం.
అయితే దామోదర రాజనర్సింహ తెలంగాణ తరఫున తాను విడిగా నివేదిక అందజేయనున్నందున, నిపుణులతో సమావేశం కావడం వల్ల రాలేకపోయినట్లు సమాచారం.రాష్ట్రాన్ని కలిపి ఉంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సమైక్యాంధ్రవాదులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రం విడిపోతే ఆర్థిక, సామాజిక, జల సమస్యలు పెరుగుతాయని వారు తేల్చి చెప్పినట్లు సీనియర్ మంత్రి ఒకరు వెల్లడించారు. ఇదే అంశాన్ని రోడ్ మ్యాప్ ద్వారా అధిష్ఠానానికి వివరించి చెప్పాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, నేతలు ముఖ్యమంత్రికి సూచించారు. ఇదే అంశాన్ని అధిష్ఠానానికి వివరించాలని కోరారు. ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్‌ను, ప్రత్యేక రాష్ట్రంకోసం కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను గట్టిగా వివరించేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు.
ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా కనీసం పదిహేను పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని చూపిస్తామన్న హామీని కూడా మరోసారి అధిష్ఠానానికి వివరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద అందరి అభిప్రాయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని ఇరుప్రాంతాల వారికి ముఖ్యమంత్రి హామీనిచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications