వాయిదా వేయలేం: తెలంగాణపై దిగ్విజయ్ సింగ్

తెలంగాణపై తీసుకునే నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన చెప్పారు. ఇందుకు విపక్షాల మద్దతు అవసరమని ఆయన అన్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని, అయినప్పటికీ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ అంశంపై రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని ఆయన అంతకు ముందు మీడియా ప్రతినిధులతో అన్నారు. కోర్ కమిటీ సమావేశం తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఇచ్చే నివేదికలపై కోర్ కమిటీలో చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ ఢిల్లీకి చేరుకున్నారు. బొత్స సత్యనారాయణతో సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ సమావేశమయ్యారు. సీమాంధ్ర నాయకులు దిగ్విజయ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు జెడి శీలం, చిరంజీవిలను కలిశారు. అంతకు ముందు కెవిపి రామచందర్ రావు నివాసంలో సమావేశమయ్యారు.
బొత్స సత్యనారాయణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డితో కూడా సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన మంత్రులు డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జె. గీతారెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఒయు జెఎసి విద్యార్థులు సీమాంధ్ర మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్, కొండ్రు మురళిలకు గులాబీలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications