వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపై జైపాల్ రెడ్డితో డిగ్గీ భేటీ: ఆగస్టు 5లోపే నిర్ణయం?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Jaipal Reddy and Digvijay Singh
న్యూఢిల్లీ: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు పార్టీ అధిష్టానం ఈ నెల లోపు నిర్ణయం తీసుకుంటుందా అనే విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్ని చెప్పినా నాన్చడం, వాయిదా వేయడం కాంగ్రెసు అధిష్టానానికి అలవాటేనని అనుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, ఈ నెలాఖరులోగా తెలంగాణ సమస్యను తేల్చేస్తామని దిగ్విజయ్ సింగ్ చిటికె వేసి మరీ చెప్పారు.

దిగ్విజయ్ సింగ్ సోమవారం సాయంత్రం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణ అంశంపై చర్చ జరిగింది. తెలంగాణ అంశాన్ని తేల్చే విషయంలో జైపాల్ రెడ్డి అభిప్రాయం ముఖ్యమని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపే జైపాల్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు.

వచ్చే నెల 5వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానికి ముందే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం పార్టీపరంగా నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతుందని అంటున్నారు. ఈ సమావేశాల్లో ఆహార భద్రతా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 30 వరకు జరగనున్నాయి. తెలంగాణ అంశంపై ఈ సమావేశాల్లో చర్చ చేపట్టవచ్చునని కూడా భావిస్తున్నారు.

తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు కోర్ గ్రూప్ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసికి సిఫార్సు చేసింది. సిడబ్ల్యుసిలో తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదనే విషయం తెలిసిందే. సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని అమలు చేయడానికే సిద్ధపడాలని కూడా పార్టీ అధిష్టానం అనుకుంటోంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ కూడా చెప్పారు.

సిడబ్ల్యుసిలో ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. నిర్ణయం తీసుకునే బాధ్యతను సిడబ్ల్యుసి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పార్టీ వైఖరిగా ప్రకటించే అవకాశాలున్నాయి. తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని అంటున్నారు.

English summary
The Congress Andhra Pradesh affairs incharge Digvijay Singh met S Jaipal Reddy, union minister from Telangana region on Telangana issue. It is said that Congress high command may take decission on Telangana before Parliament mansoon session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X