టీకి బొత్స మంత్రం: 25 ఏళ్లు యుటిగా హైదరాబాద్

ఆ మీడియా కథనాల ప్రకారం - సాధ్యమైనంత వరకు తెలంగాణ ఇవ్వకపోవడమే సరైన నిర్ణయమని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడం వల్ల మొత్తం రాష్ట్రానికీ తీవ్ర నష్టం జరుగుతుందని, అనేక సమస్యలు ఏర్పడతాయని అధిష్ఠానం ముందు ఆయన తేల్చి చెప్పారు. నిజానికి సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, తెలంగాణ కూడా ఈ 56 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడంతో రాజకీయావకాశాలు లేని కొన్ని వర్గాలు ప్రత్యేక రాష్ట్ర్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయని వివరించారు.
అందువల్లే 2001 వరకూ తెలంగాణ ఆర్థికంగా వెనుకబడినట్లు వాదించేవారని, అది నిజం కాదని తేలడంతో ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి వాస్తవాలు వివరించడంలో వారు విఫలమయ్యారని చెప్పారు. ప్రభుత్వోద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందన్న ప్రత్యేక ఉద్యమకారుల వాదనలో వాస్తవం లేదని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాలు ప్రాంతాల వారీగా దక్కవని, చిన్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఐఎఎస్ అధికారులు వచ్చిన సందర్భాలున్నాయని తెలిపారు.
అదే విధంగా ఏపీపీఎస్సీ కూడా ప్రాంతాల వారీగా, జనాభా ప్రాతిపదికగా ఉద్యోగులను ఎంపిక చేయదని వాదించారు. ఇక రాయలసీమ నుంచి పలువురు ముఖ్యమంత్రులున్నా ఆ ప్రాంతం వెనుకబడిందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ఎక్కువమంది ముఖ్యమంత్రులున్నా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న హామీ లేదన్నారు. తమ ప్రాంతం నుంచి కేవలం నలుగురే ముఖ్యమంత్రులున్నారని, వారిలో జలగం వెంగళరావు వలస వచ్చిన వారని తెలంగాణ వారు వాపోవడంలో అర్థం లేదని బొత్స అభిప్రాయపడ్డారు. ఈ కారణాలతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు.
రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం ఏకపక్షంగా తెలంగాణను ప్రకటించేందుకు వీలు లేదని, అందులో రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడే అధికారాలున్నాయని బొత్స వాదించారు. ఇందుకు ఒక హేతుబద్ధమైన విధానం, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాయలసీమ మాటేమిటని ఆయన ప్రశ్నించారు. 1936లో వారిలో అవిశ్వాస భావనలు తొలగించి కోస్తాంధ్రలో కలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు తర్వాత కర్నూలులో రాజధాని ఉండేదని, ఇప్పుడు మరోచోట పెడతానంటే వారు తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాలు, రెవెన్యూ, హైదరాబాద్‌కు సంబంధించి సమస్యలు ఏర్పడతాయని చెప్పారు. ముఖ్యంగా గత 56 ఏళ్లలో హైదరాబాద్ రాజకీయ రాజధానిగా, బలోపేతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఆయన చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే లభిస్తోందని బొత్స చెప్పారు. 95 శాతం సాఫ్ట్‌వేర్ పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉందని, 30 శాతం పన్నులు అక్కడి నుంచే లభిస్తాయని చెప్పారు. రాజధాని అయినందువల్లే ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. నిజానికి ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా రాజధానుల్లో కాక ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థలను చూసి ప్రైవేటు రంగ సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, ప్రైవేట్ రంగ సంస్థల్లో 90 శాతం అక్కడే ఉన్నాయని బొత్స చెప్పారు. రూ.55 వేల కోట్ల మేర సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతుంటే అందులో రూ.54,500 కోట్లు హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. వీటన్నిటివల్లనే ఇతర ప్రాంతాల ప్రజలు కొన్ని తరాలుగా హైదరాబాద్‌లో మనుగడ సాగించడం ప్రారంభించారని, తమ జీవితకాల పొదుపును ఇక్కడే పెట్టుబడులుగా పెట్టారని తెలిపారు. వీరంతా ఎక్కడికి వెళతారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications