సిక్కోలులో అడుగుపెట్టిన షర్మిల, బొత్సపై మరోసారి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మళ్లీ రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని, దానికి చరమగీతం పాడాలన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులను గెలిపించాలన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం.. రైతులను ఆదుకునేందుకు 7 గంటల ఉచిత విద్యుత్తు.. రైతులకు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఆరోగ్యశ్రీ.. 108, 104.. ఇలా ఎన్నో పథకాలను అద్భుతంగా అమలు చేశారన్నారు.
ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకూడదని ఎలాంటి చార్జీలు పెంచలేదు. పన్నులు వేయలేదు. కానీ వైఎస్ వెళ్లిపోయిన తర్వాత ఆయన పథకాలను తుంగలోకి తొక్కారు. అడ్డగోలుగా అన్నింటిపై చార్జీలు పెంచేశారు. ఇప్పుడు రాక్షస రాజ్యం.. రాబందుల రాజ్యం నడుస్తోంది. కాగా ఆదివారం 216వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా విక్రమపురం సమీపంలో ముగిసింది. ఆదివారం 13.8 కి.మీ. నడిచారు.
బొత్సపై మరోసారి
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన షర్మిల మళ్లీ మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి దారిలో నడుస్తున్నందుకు తాము గర్వంగా ఫీల్ అవుతున్నామన్నారు. కాంగ్రెసు పార్టీ మాత్రం ఆయన దారిని విడిచిపెట్టిందన్నారు. తాను బొత్సను వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదని, ఆయన మాత్రం తన తండ్రి పైన వ్యక్తిగత విమర్శలు చేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications