టి: చంద్రబాబు మౌనంపై అంతర్మథనం, జగన్‌పై అలక
హైదరాబాద్: విభజనపై పార్టీలలో చిచ్చు రాజుకుంటోంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నదనే వార్తల నేపథ్యంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో రాజీనామాల వేడి రాజుకోగా.. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఇరుప్రాంతాల నేతలు మదనపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు విభజనపై ధీమాగా ఉన్నారు. సీమాంధ్ర నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తాము చివరి వరకు కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని, ఇదే విషయాన్ని వారు అధిష్టానానికి కూడా చెప్పారు. అదే సమయంలో రాజకీయంగా పార్టీకి ఎలాంటి లాభం లేదని, భౌగోళికంగా సీమ జిల్లాలకు నష్టం జరుగుతుందని పార్టీ పెద్దల ముందు ఉంచారు.

కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులను కలుస్తున్న సీమాంధ్ర నేతలు విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు తమ చివరి ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధానిని కలిసినా వారికి పరిస్థితి ఆయన నుండి సంతృప్తికర సమాధానం రాలేదు. రేపు, ఎల్లుండి కూడా పలువురు అక్కడే ఉండి సమైక్య గళం వినిపించనున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనను అడ్డుకోవద్దంటూ సీమాంధ్ర నేతలకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విభజన అంశంపై మొదటి నుండి మౌనం వహిస్తూ, పరిస్థితిని పరిశీలిస్తోంది. అయితే సీమాంధ్ర, తెలంగాణ తమ్ముళ్లలో మాత్రం అసంతృప్తి రాజుకుంటోందని అంటున్నారు. విభజనపై ఇంత పెద్ద ఎత్తున వేడి రాజుకుంటే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మౌనం వారికి అంతు పట్టడం లేదట. అధినేత ఆదేశాల మేరకు ఇరుప్రాంతాల నేతలు ఇప్పటి వరకు మౌనం వహిస్తూ వస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ నేతలు రాజీనామాలు, లాబియింగ్ ద్వారా విభజన అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ, తమ నుండి ఎలాంటి స్పందన లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని ఆందోళన చెందుతున్న సీమాంధ్ర తమ్ముళ్లు ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట. శనివారం సమైక్యాంధ్ర ఐకాస నేతలు తమ ఇళ్లను ముట్టడించిన సమయంలో పార్టీ నేతలు పయ్యావుల కేశవ్.. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత స్పందిస్తానని, మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తెలంగాణ విభజనను వ్యతిరేకించకుండా.. విభజనకు ముందు నీళ్లు, రెవెన్యూ తదితర అంశాలపై సమన్యాయం జరగాలని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు గొంతెత్తుతున్న తరుణంలో తాము మాట్లాడకపోతే సీమాంధ్రలో పార్టీ పరిస్థితి, తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన కూడా పలువురిలో కనిపిస్తోందని అంటున్నారు. అయితే మౌనంగా ఉండి పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటేనే మేలని లేదంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వచ్చిన చిచ్చు కంటే పార్టీలో ఎక్కువగా ఉంటుందని, అప్పుడు పార్టీకే అధిక నష్టమని చెప్పే వారు కూడా లేకపోలేదు. కాంగ్రెసు నిర్ణయం ప్రకటించే వరకు నిరీక్షించడమే మంచిదని, తొందరపడితే లాభం లేదని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర చిచ్చు రాజుకుంది. ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన కొండా దంపతులతో మొదటి నుండి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉంటున్నారు. పదవులు వదిలి పెట్టుకున్నారు. అలాంటి కొండా దంపతులు ఇప్పుడు పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications