సీమాంధ్రలో రచ్చ: నేతలకు హెచ్చరిక, విగ్రహానికి నిప్పు
హైదరాబాద్/విశాఖ/గుంటూరు/విజయవాడ: సీమాంధ్రలో రెండో రోజు కూడా బంద్ కొనసాగుతోంది. యూపిఏ, కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర రెండు రోజులుగా రగిలిపోతోంది. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పదమూడు జిల్లాల్లో గురువారం ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాస రావు, రామచంద్రయ్య తదితర నేతల ఇళ్లను సమైక్యవాదులు ముట్టడించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి పైన జెఏసి నాయకులు రాళ్ల దాడి చేశారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తమ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఎయులోకి ఎంపి సబ్బం హరిని విద్యార్థులు అడ్డుకున్నారు. పదవికి రాజీనామా చేసి విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టాలని హెచ్చరించారు.

చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు నిరవధిక దీక్ష కొనసాగుతోంది. కడప జిల్లాలో విభజనపై అట్టుడుకుతోంది. జిల్లాలో ఇద్దరు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. విభజన అంశంపై యూ టర్న్ తీసుకునే ప్రకటన వెలువడే వరకు తాము దిగి వచ్చేది లేదని, తమను అడ్డుకోవాలని చూస్తే కిందకు దూకుతామని హెచ్చరిస్తున్నారు. వారిని దింపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు.
కడప జిల్లా కాజీపేటలో సమైక్యవాదులు బందు పాటిస్తున్నారు. జాతీయ రహదారి పైన ఉన్న వంతెనపై ట్రాక్టరును అడ్డుగా పెట్టి రాకపోకలను పూర్తిగా స్తంభింపచేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. సీమాంధ్ర నాయకులు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసేలా చూడాలని బాపూజీకి వినతి పత్రం ఇచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల విద్యార్థులు మానవహారం నిర్వహించారు. డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. పలుచోట్ల బయటకు వచ్చిన బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో సమైక్యవాదులు రాజీవ్ గాంధీ విగ్రహానికి నిప్పు పెట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇందిర విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిన్న అనంతపురంలో రాజీవ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఇందిర విగ్రహానికి నిప్పు పెట్టారు.












Click it and Unblock the Notifications