తెలంగాణ: అభ్యంతరాలపై మరో కమిటీ ఏర్పాటు

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను, నేతల రాజీనామాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో ఆ కమిటీ ఏర్పాటుకు అధిష్టానం ముందుకు వచ్చింది. విభజనపై వెనక్కి వెళ్లలేమని, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని దిగ్విజయ్ సింగ్ శుక్రవారం తనను కలిసి సీమాంధ్ర కేంద్ర మంత్రులతో చెప్పారు. వారిని శాంతింపజేసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఆ చర్యకు పూనుకుంది. సీమాంధ్ర నేతల రాజీనామాలు, విగ్రహాలు ధ్వంసం తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి నివేదికలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం సోనియాగాంధీని కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.
రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయం తీసేసుకున్నామని,త ఇక దాని అమలుపైనే దృష్టి పెట్టాలని, ఆలస్యమైనకొద్దీ అనేక సమస్యలు తీవ్రమవుతాయని వారు భావించినట్లు తెలిసింది. సీమాంధ్ర కేంద్ర మంత్రులతో దిగ్విజయ్ జరిపిన చర్చల వివరాలను శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్‌లో సమర్థంగా లేవనెత్తాలని దిగ్విజయ్ సింగ్ సూచించారని, తద్వారా ఈప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలను సరైన దృక్పథంతో పరిష్కరించవచ్చునని చెప్పారని ఆ ప్రకటనలో తెలిపారు. విభజనకు సంబంధించి చట్టపరమైన చర్యలు ప్రారంభించేముందు సీమాంధ్ర నేతలతో నిర్మాణాత్మక పద్ధతిలో సంప్రదింపులు జరిపేందుకు సోనియా గాంధీతో చర్చించిన అనంతరం ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమిస్తామని దిగ్విజయ్ తెలిపారు. ఈ కమిటీని రక్షణ మంత్రి ఆంటోనీ నేతృత్వంలో నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ప్రతిపత్తి, నదీజలాలు, ఆదాయం పంపిణీ, ఆస్తులు - అప్పుల విభజన మొదలైన సమస్యలపై సీమాంధ్ర నేతల వాదనలను వినాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. సీమాంధ్ర నేతలు, ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ కూడా ఒక అభ్యర్థనను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications