ఎంపి సబ్బం హరి రాజీనామా: చిరంజీవిపై ఫైర్

హై పవర్ కమిటీ పేరు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దాన్ని నమ్మవద్దని సబ్బం హరి కేంద్ర సీమాంధ్ర మంత్రులకు సూచించారు. ముందు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించాలని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ఏ కమిటీ ముందైనా కూర్చోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడానికి చేసిన ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిందని, ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని పాటించారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన శనివారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
గుజరాత్, తమిళనాడుల్లో పార్టీని సర్వనాశనం చేసిన నాయకులతో, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయలేక పారిపోయి వచ్చిన నాయకుడితో తాము మాట్లాడుతూ వచ్చామని, తెలుగువారికి ఈ దౌర్భాగ్యం ఏమిటని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌మను, ఆజాద్‌ను, అహ్మద్ పటేల్‌ను ఆయన తప్పు పట్టారు. ఇరు పక్షాల మధ్య వివాదం ఉన్నప్పుడు చట్టబద్దమైన వ్యవస్థ ద్వారా పరిష్కారం చూడాలని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టి రాష్ట్ర విభజనపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందని, దానికి విరుద్ధంగా కాంగ్రెసు నాయకత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎవరితోనూ మాట్లాడకుండా కాంగ్రెసు అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. ప్రజస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.
అరవై యేళ్లు పార్టీలకు అతీతంగా కృషి చేసి హైదరాబాదును ఈ స్థాయికి తెచ్చుకున్నామని, దాన్ని వదిలేసి వెళ్లిపోవాలంటే ఎలా అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలకు కాంగ్రెసు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ మాదిరిగా మాట్లాడితే, వ్యవహరిస్తే దేశం దగ్ధమైపోతుందని ఆయన అన్నారు. క్షోభకు గురిచేసిన కెసిఆర్‌ను తెలుగువాళ్ల క్షమించబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications