టితో చిచ్చు పెట్టారు, బిల్లు పెట్టండి: నిలదీసిన విపక్షాలు

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా చేయటం సమర్థనీయం కాదని ఆయా పార్టీల నేతలు దుయ్యబట్టారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 30 వరకూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో సభను సజావుగా నడిపించేందుకుగాను అన్ని పార్లమెంటరీ పార్టీల నాయకులతో స్పీకర్ మీరా కుమార్ సమావేశమయ్యారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభాపక్ష నాయకుడు, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అంశంపై బిజెపి, టిడిపి, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఎడిఎంకె, శివసేన, అకాలీదళ్ పార్టీల నాయకులు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ బెనర్జీ, దినేశ్ త్రివేదీలు కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. అయితే ప్రధాని కానీ, హోం మంత్రి కానీ, కమల్ నాథ్ కానీ స్పందించలేదు. కేంద్రంలో భాగమైన ఎన్సీపి అధినేత శరద్ పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్‌లు సైతం తెలంగాణ చర్చలో పాల్గొనలేదు.
తొలుత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసమే తెలంగాణను ప్రకటించిందని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్వరగా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాల వైఖరిలో స్పష్టత లేదని, తెలంగాణపై మరింత స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు గత నాలుగు రోజులుగా ఉద్యమిస్తున్నారని, అయినా కాంగ్రెస్ కానీ, ప్రభుత్వం కానీ పట్టనట్లు వ్యవహరించటం సరికాదని తప్పుపట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ బెనర్జీ, దినేశ్ త్రివేదీలు మాట్లాడుతూ తెలంగాణను ప్రకటించి కాంగ్రెస్ దేశంలో చిచ్చు రగిల్చిందని మండిపడ్డారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల్లో డిమాండ్లకు ఊపిరిపోయటం సరికాదన్నారు. తెలంగాణను ఇవ్వటం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు రగిలిపోతున్నాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేముందే మిగతా రాష్ట్రాల్లోని డిమాండ్లను కూడా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లు పెట్టి దేశం మీదకు తోయటం సరికాదని అన్నారు.
ఎస్పీ నాయకుడు శైలేంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరు బాగోలేదని, చిన్న రాష్ట్రాల వల్ల ఎలాంటి అభివృద్ధీ ఉండదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన తీరు సరికాదని డిఎంకె నాయకుడు బాలు అభి ప్రాయపడ్డారు. ఎఐడిఎంకె నాయకుడు తంబిదొరై మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజల రాష్ట్రంగా భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, ఆ రాష్ట్రాన్ని విభజించటం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ఇప్పుడెందుకు పరిష్కరించారో చెప్పాలని శివసేన, అకాలీదళ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications