అంచనాలకు మించి సమైక్య ఉద్యమం!, మృత్యుఘోష
రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఆందోళనల తీవ్రత ఊహించిన దానికి మించి ఉంటోందని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన వెంటనే సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళన చెలరేగుతుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే అంచనాలకు మించి ఇది ఉంటోందని అవి భావిస్తున్నాయి. ఉద్యమం వేగంగా విస్తరిస్తోందని కేంద్రానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం.
తెలంగాణవాసికి సన్మానం
ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసి డిపో వద్ద సోమవారం విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణకు చెందిన స్థానిక ఉద్యోగి లక్ష్మీ నారాయణను పూలదండతో సన్మానించారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ నారాయణ స్థానిక ఆర్ అండ్ బి శాఖలో ఈఈగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా ఇక్కడి వారు చాలా మంచిగా చూసుకుంటున్నారన్నారు.

ఏడో రోజు నిరసనలు
సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏడో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మానవహారాలు నిర్వహిస్తున్నారు. రోడ్ల పైనే వంటా వార్పు నిర్వహిస్తున్నారు. రోడ్లను దిగ్బంధిస్తున్నారు.
మృత్యుఘోష
విభజన నిర్ణయంపై సీమాంధ్రలో పలువురు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం ఉనకరమిల్లికి చెందిన రవి ఆత్మహత్య చేసుకున్నాడు. చింతలపూడికి చెందిన కొవ్వూరి రాంబాబు గుండెపోటుతో మరణించాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గోనబావి గ్రామంలో కుళ్లాయప్ప విభజన, ఆందోళన వార్తలు టివీలో చూస్తూ కుప్పకూలిపోయాడు. గత వారం రోజులుగా ఆయన విభజనపై ఆందోళన చెందుతున్నాడట.
చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దరామాపురం గ్రామంలో సమైక్య రాష్ట్రం కోసం ఆత్మార్పణకు ప్రయత్నించిన ఆంజనేయులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లోను మృతి చెందారు.












Click it and Unblock the Notifications