హైద్రాబాదే సమస్య, షర్మిల రెచ్చగొడ్తున్నారు: నారాయణ

సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని, విభజన తర్వాత వెళ్లిపోవాలన్ని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఎందుకు ఉండవన్నారు. విభజన నిర్ణయం అనంతరం జరుగుతున్న ఉద్యమం హైదరాబాద్ చుట్టే తిరుగుతోందని, ఈ అంశాన్ని పరిష్కరిస్తే సమస్య కొలిక్కి వస్తుందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల కూడా తండ్రిలాగే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు.
గతంలో తాము సమైక్యవాదం అన్నప్పటికీ ప్రజల మనోభావాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు, ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కెసిఆర్ బాంబు వేసినట్లు మాట్లాడటం సరికాదన్నారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, టిడిపులు తమ అజెండాలను పక్కన పెట్టి అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇప్పుడు రెండు ప్రాంతాల మధ్య బంధుత్వాలు, స్నేహం బాగా పెరిగాయన్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరు ఆంధ్రా గో బ్యాక్ అనే పరిస్థితి లేదన్నారు. ప్రజలు రాయల తెలంగాణ అడగటం లేదన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీని పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు నమ్మే పరిస్థితి లేదని అయితే, ఇంత దూరం వచ్చాక వెనక్కిపోతే బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. సీమాంధ్రలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.












Click it and Unblock the Notifications