అభివృద్ధిపై చర్చిద్దాం: ప్రధానికి మోడీ సవాల్
అహ్మదాబాద్: ప్రధాని మన్మోహన్ సింగ్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశం మార్పు కోసం అశాంతితో ఎదురు చూస్తోందని ఆయన అన్నారు. దేశం, గుజరాత్ సాధించిన అభివృద్ధిపై తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్తాన్ పట్ల ప్రధాని మెతకవైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు.
67వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతీయ పతాకను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. యుపిఎ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగంలో సందేశం లేదని, తాను మాత్రమే కాదు దేశం యావత్తు ప్రధాని ప్రసంగానికి నిరాశ చెందిందని ఆయన అన్నారు.

పరిస్థితి మారకపోతే అరవై ఏళ్ల పాటు మీరేం చేస్తున్నట్లని ఆయన అడిగారు. దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ప్రధాని మన్మోహన్ సింగ్ పివి నర్సింహారావును ప్రస్తావించారని, ప్రస్తుతం రూపాయి విలువ పడిపోవడానికి ఎవరు కారణమని ఆయన అన్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
అత్యధిక సార్లు జాతీయ పతాకను ఆవిష్కరించే అవకాశం ప్రధానికి వచ్చిందని, అయినా నెహ్రూ ఏం చెప్పాడో మన్మోహన్ సింగ్ చెప్పారని, నెహ్రూ తన తొలి ప్రసంగంలో ఎత్తి చూపిన సమస్యలనూ పట్టింపులనూ మన్మోహన్ ఎత్తి చూపారని ఆయన అన్నారు. పాకిస్తాన్‌పై ప్రధాని మెతగ్గా మాట్లాడారని ఆయన విమర్శించారు. ఐదుగురు జవాన్లను పాకిస్తాన్ చంపడంపై రాష్ట్రపతి తీవ్ర ఆక్షేపణ తెలిపారని, ఆ మాత్రం ఆక్షేపణ ప్రధాని తెలియజేయలేకపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications