21 నుంచి టీచర్స్ మెరుపు సమ్మె, పక్షపాతమని టిజి
చిత్తూరు/విజయవాడ/చిత్తూరు: ఈ నెల 21వ తేది(బుధవారం) అర్ధరాత్రి నుండి ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో భేటీ అయిన సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి కార్యాచరణను ప్రకటించింది. ఈ భేటీకి పదమూడు జిల్లాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 21 నుండి సమ్మె చేస్తామని, 19న సిఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని ప్రకటించారు.
అవనిగడ్డలో ఉప ఎన్నికలు ఉన్నందున ఎలక్షన్ సిబ్బంది మినహా అందరూ 21 నుండి పాల్గొంటారని, మిగిలిన వారు కూడా ఎన్నికల తర్వాత పాల్గొంటారని చెప్పారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఉండాలని, ప్రజా ఉద్యమాన్ని దృష్టిలో పెటటుకొని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

విహెచ్ వ్యాఖ్యలు సరికాదు: భూమన
సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్రులను రెచ్చగొట్టేలా విహెచ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విభజన అంశం ప్రజల భావోద్వేగాలతో ముడివడి ఉందన్నారు. విభజన నేపథ్యంలో విహెచ్ వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైందన్నారు.
పక్షపాతం: టిజి వెంకటేష్
రాయలసీమకు అన్యాయం జరిగే విధంగా ప్రాజెక్టులు పెండింగులో పెట్టి, తెలంగాణకు అనుకూలంగా జివో 72 విడుదల చేయడం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేమనని మంత్రి టిజి వెంకటేష్ కర్నూలు జిల్లాలో అన్నారు. జివో 72కు సంబంధించి స్పష్టత వచ్చే వరకు కాంగ్రెసు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొననని చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదన్నారు. రాష్ట్ర సమైక్య పరిరక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
తెలంగాణపై పక్షపాతం చూపుతూ ఒకేరోజు ఇరిగేషన్ మంత్రి ఒకేరోజు రెండు జివోు విడుదల చేశారని, ఇది సరికాదన్నారు. సంవత్సరం పూర్తి కాకుండానే ఇరిగేషన్ ఎస్ఈ, సిఈలను బదలీ చేశారని ఆరోపించారు. ఈ విషయమై మాట్లాడుదామంటే మంత్రి సుదర్శన్ రెడ్డి సమావేశాలకు హాజరు కావడం లేదని, ఫోన్లో అందుబాటులోకి రావడం లేదన్నారు. అందుకే తాను సీమాంధ్ర మంత్రుల సమావేశానికి హాజరు కాలేదన్నారు.












Click it and Unblock the Notifications